దేశంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నారా.. ఉంటే చూపించాలే.. అని మంత్రి కేటీఆర్ ఓపెన్ సవాల్ చేశారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటివి ఇస్తున్నారా? అని విపక్షాలను ప్రశ్నించారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, కావాలని సీఎం కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. సీఎం కేసీఆర్ అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. పేదలు ఉండే ప్రాంతాల్లో ఈ ఇండ్లు నిర్మిస్తున్నాం. ముస్తాబాద్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాల హయాంలో ఒక ఇంటి నిర్మాణం కోసం ముప్పుతిప్పలు పెట్టేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలు ఆత్మగౌరవం బతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నాం. ఈ ఇండ్లు ప్రయివేటు బిల్డర్ కడితే రూ. 20 నుంచి రూ. 25 లక్షల ఖర్చు అయ్యేది. రాజకీయాలకు తావులేకుండా అర్హులైన వారికి ఇండ్లు కేటాయిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ ను కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? దమ్ముంటే చూపించాలని సవాల్ విసిరారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సీఎం కేసీఆర్ మొండిమనిషి. ఆయన ఏ పని చేపట్టిన పూర్తయ్యేదాకా వదలరు.. కాబట్టి ప్రతీ పేద వ్యక్తికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.