Friday, November 22, 2024

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 18 మంది సజీవదహనం

గుజరాత్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. భారుచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు సజీవదహనమయ్యారు. ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు. కొవిడ్‌ వార్డులో చికిత్స తీసుకుంటున్న 12 మంది రోగులు మంటలు అంటుకొని, భారీగా వ్యాపించిన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారని భారుచ్‌ ఎస్పీ రాజేంద్ర సిన్హా తెలిపారు. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు.

భారుచ్‌-జంబుసర్‌ రహదారిపై ఉన్న నాలుగు అంతస్థుల భవనంలో హాస్పిటల్‌ ఉండగా.. దీన్ని ఓ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. నాలుగు అంతస్తులున్న ఈ ఆసుపత్రిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 1.00 గంట సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 70 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వారిలో 24 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శనివారం ఉదయం వరకు 18 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement