ఓటర్ ఐడీ నమోదుకి ఇకపై 17ఏళ్లు నిండితే చాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నాటికి 18 యేండ్ల నిండి వాళ్లు మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఓ వెసులుబాటు కల్పించింది.18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, 17 ఏళ్లు నిండిన యువత కూడా ఓటర్ ఐడీ కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్పు ప్రకారం.. 17 ఏళ్లు నిండిన.. ప్రతిపౌరుడు ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే నేతృత్వంలోని కమిషన్ యువత సంవత్సరానికి మూడుసార్లు ముందస్తు దరఖాస్తులను దాఖలు చేయడానికి సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్య నిర్వహణాధికారులను ఆదేశించింది.
యువత కేవలం జనవరి 1నే కాకుండా.. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. ఇక నుంచి ప్రతి త్రైమాసికానికి ఒక్కసారి ఓటర్ జాబితాను అప్డేట్ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత ఓటరు జాబితా సవరణలో కూడా యువత దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత యువతకు ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) జారీ చేయబడుతుందని పేర్కొంది. ఓటరు జాబితా 2023 కోసం ఈ సమయంలో సవరణలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ముందస్తు దరఖాస్తును సమర్పించవచ్చు.