కల్తీ మద్యం సేవించడంతో 17మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన బీహార్ లోని సరణ్ జిల్లాలోని పలు గ్రామాల్లో చోటు చేసుకుంది. కాగా చాలా మంది బాధితులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వీరి మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో తేలనుందని పోలీసులు పేర్కొన్నారు.అయితే మృతుల కుటుంబ సభ్యులు మాత్రం కల్తీ మద్యం సేవించడం వల్లే మృతి చెందారని వాపోతున్నారు.
ఇదిలా ఉండగా, బీహార్‌లో కల్తీ మద్యం ఏరులై పారుతుందని ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆందోళనకు దిగాయి. సీఎం నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. కల్తీ మద్యాన్ని సీఎం నితీశ్ కుమార్ కూడా సేవిస్తున్నట్లు తమకు వినిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సేవించి వేల సంఖ్యలో జనాలు చనిపోతున్నప్పటికీ, నితీశ్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.