Friday, November 22, 2024

గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతం.. ఏపీకి 17 అవార్డులు సొంతం

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి.

ఏపీకి 17 అవార్డులు రావడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని ఆయన చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ-గవర్నెన్స్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు వచ్చిందన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన.. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చిన 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన ఏప్రిల్‌ 24వ తేదీని, జాతీయ పంచాయతీ దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాగా పని చేసిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీలలో కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేస్తోంది. ఆ మేరకు గత ఏడాది (2020)లో రాష్ట్రానికి 15 అవార్డులు రాగా, ఈసారి మొత్తం 17 అవార్డులు వచ్చాయి. ఈ–పంచాయత్‌ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈ ఏడాది (2021) రాష్ట్రానికి దక్కాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement