Tuesday, November 26, 2024

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 16 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం మంథని నుంచి బయల్దేరి కరీంనగర్‌కు వెళ్తున్న క్రమంలో సుల్తానాబాద్‌ బస్టాండ్‌కు చేరుకుంది. బస్టాండ్‌ నుంచి రాజీవ్‌ రహదారికిపైకి చేరుకుంటున్న సందర్భంలో అతి వేగంగా వచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా.. వీరిలో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.

గాయపడిన ప్రయాణికులను సుల్తానాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ రాజీవ్‌ రహదారి పక్కనే ఉండడం, బస్టాండ్‌ నుండి బస్సులు బయటకు వచ్చే సమయంలో రాజీవ్‌ రహదారిపై వచ్చే వాహనాలను గమనించే పరిస్థితి లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. బస్టాండ్‌ ఎగ్జిట్‌ గేటు- వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని, ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement