Friday, November 22, 2024

Big Story: స్పౌస్​ ట్రాన్స్​ఫర్​కి 15 లక్షలు.. పరస్పర బదిలీలకు ఫుల్​ డిమాండ్​

అవును.. ఒక్కో ట్రాన్స్​ఫర్​కి 15 లక్షలకు పైగానే డిమాండ్​ ఉంది.. స్పౌజ్​ బదిలీల్లో భాగంగా ఈ తంతు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. పరస్పర బదిలీలకు సంబంధించి కాసులు కురిపిస్తోంది.. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో భారీగా రేటు పెంచేశారు. భార్యభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కాగా, ఇందులో పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది. మార్చి 1వ తేదీనుండి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంది. దీంతో పరస్పర బదిలీల కోసం పదవీవిరమణకు దగ్గర్లో ఉన్న వాళ్లు ఆసక్తి చూపిస్తుండటం వారికోసం వెతుకులాట ప్రారంభమైంది.


ప్రభన్యూస్‌బ్యూరో,ఉమ్మడిరంగారెడ్డి : పరస్పర బదిలీకి ఒప్పుకుంటే ఏకంగా రూ. 10లక్షల నుండి రూ. 15లక్షల దాకా ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌కు అత్యంత చేరువలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండటంతో ఇక్కడ డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోంది.. దరఖాస్తుకు రోజులు దగ్గరపడుతుండటంతో పరస్పర బదిలీలకు అగ్నిమెంట్లు చేసుకుంటున్నారు.. బదిలీల్లో భాగంగా పెద్దఎత్తున ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున బదిలీలు జరిగాయి. సీనియర్లు హెచ్‌ఆర్సీ జిల్లాలకు బదిలీలు కాగా జూనియర్లు మాత్రం వికారాబాద్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. 317 జీవోలో భాగంగా బదిలీ ప్రక్రియను పెద్దఎత్తున ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించిన ప్రభుత్వం మాత్రం బదిలీ ప్రక్రియను కొనసాగించింది. భార్యభర్తలు ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్లు తలో జిల్లాకు బదిలీ అయ్యారు. భార్యభర్తలు ఒకే జిల్లాలో పని చేసేలా

అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది. మార్చి 1వ తేదీనుండి 15వ తేదీవరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కాకపోతే పరస్పర బదిలీలకు ఒప్పుకోవల్సి ఉంటుంది. అలా ఒప్పందాలు చేసుకుంటేనే బదిలీలు జరుగుతాయి. దరఖాస్తు ఫాంలోనే పరస్పర బదిలీలకు సంబంధించి ఇద్దరు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో అలా ముందుకు వచ్చే వారి కోసం వెతుకులాట ప్రారంభమైంది. హైదరాబాద్‌ చుట్టూరా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది. దీంతో ఇక్కడ డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హెచ్‌ఆర్‌ఎ ఎక్కువగా ఉండటంతో ఈ జిల్లాకు పరస్పర బదిలీల కింద వచ్చేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు..

పరస్పర బదిలీలకు లక్షల్లో డిమాండ్‌..
పరస్పర బదిలీలకు ముందుకు వచ్చే వారికి దండిగా డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల ద్వారా ఆరా తీస్తూ ముందుకు వచ్చే వారికి అడ్వాంసులు కూడా చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మేడ్చల్‌ జిల్లానుండి పరస్పర బదిలీ కింద వికారాబాద్‌ జిల్లాకు వెళ్లేవారికి ఏకంగా రూ.15లక్షల ఆఫర్‌ కూడా ఇస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాకు రూ. 10లక్షల పైమాటే వినికిపిస్తోంది. బదిలీల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లానుండి మేడ్చల్‌ జిల్లాకు వచ్చిన వాళ్లు తిరిగి వికారాబాద్‌ జిల్లాకు వెళ్లాలంటే వారికి ఏకంగా రూ. 15లక్షల వరకు ముట్టజెప్పేందుకు వెనకాడటం లేదు.

దూర ప్రాంతానికి వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అందులో భాగంగానే డబ్బులు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు. గతంలో కూడా పరస్పర బదిలీలకు పెద్దఎత్తున డబ్బులు ముట్టజెప్పిన విషయం తెలిసిందే. తాజాగా డిమాండ్‌ పెరిగింది. రూ. 10లక్షల నుండి రూ. 15 లక్షల వరకు పరస్పర బదిలీలకు డిమాండ్‌ నెలకొంది.

పదవీ విరమణ దగ్గర్లో ఉన్న వాళ్లకు డిమాండ్‌..
ఒక ఉపాధ్యాయుడు వికారాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తి..ఆయన అక్కడే స్థిరపడ్డారు. బదిలీల్లో భాగంగా ఇటీవల ఆయనకు మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాకు బదిలీ అయ్యింది. పదవీవిరమణ దగ్గర్లో ఉండటంతో వాళ్లు తమ సొంత జిల్లాలోనే పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి వారికి డిమాండ్‌ ఎక్కువగా పలుకుతోంది. పరస్పర బదిలీల్లో భాగంగా వాళ్లు తిరిగి తమ సొంత జిల్లా వికారాబాద్‌ వెళ్లేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. చాలామంది హెచ్‌ఆర్‌ఎ వదులుకుని తమ సొంత జిల్లాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హెచ్‌ఆర్‌ఎకు సరిపడు డబ్బులు పరస్పర బదిలీల్లో భాగంగా అందుతుండటంతో వాళ్లు అందుకు అంగీకరిస్తున్నారు. అందులో భాగంగా మేడ్చల్‌ జిల్లానుండి వెళ్లేవారికి ఏకంగా రూ. 15లక్షలు ముట్టజెప్పేందుకు ముందుకు వస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా వారికి రూ. 10లక్షలవరకు డిమాండ్‌ పలుకుతోంది. డబ్బులకు ఏమాత్రం వెనకాడకుండా పరస్పర బదిలీలకు ముందుకు వచ్చేవారికి ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏ జిల్లాలో స్థిరపడ్డవాళ్లు అదే జిల్లాలో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీపై వచ్చినా వాళ్లు తిరిగి తమ సొంత జిల్లాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భార్యభర్తలు తలో జిల్లాలో పని చేయడం వారికి ఇబ్బందిగా మారింది. వీరి కోసం పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో లక్షలు ఖర్చు పెట్టి పరస్పర బదిలీ కింద ఇద్దరు ఒకే జిల్లాకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మార్చి 1వ తేదీనుండి దరఖాస్తులు..
పరస్పర బదిలీలకు సంబంధించి మార్చి 1వ తేదీనుండి 15వ తేదీవరకు దరఖాస్తులు చేసుకోవల్సి ఉంటుంది. పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకునే సమయంలో అందులో బదిలీపై వెళ్లేవాళ్లు….బదిలీపై తిరిగి వచ్చేవాళ్లు ఇద్దరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో పరస్పర బదిలీలకు ముందుకు వచ్చే వారి కోసం అన్వేషణ జోరుగా కొనసాగుతోంది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల ద్వారా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పరస్పర బదిలీ కింద జిల్లాకు వచ్చిన తరువాత తాము అనుకున్న స్కూల్‌కు బదిలీ చేయించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద పరస్పర బదిలీలకు సంబంధించి జోరుగా ఒప్పందాలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement