Friday, November 22, 2024

గర్భాదానం కోసం ఖైదీకి 15 రోజుల పెరోల్‌.. భార్య పిటిషన్‌పై హైకోర్టు తీర్పు

భార్య గర్భం ధరించేందుకు అవకాశం కల్పిస్తూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తికి రాజస్థాన్‌ హైకోర్టు 15 రోజుల పెరోల్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 5వ తేదీన రాజస్థాన్‌ హైకోర్టు జోథ్‌పూర్‌ బెంచ్‌ ఈ అరుదైన తీర్పు వెలువరించింది. సంతానం పొందే హక్కు కింద తన భర్తను విడుదల చేయాలంటూ నందాలాల్‌ అనే ఖైదీ భార్య రేఖ వేసిన వ్యాజ్యాన్ని విచారించిన జోథ్‌పూర్‌ బెంచ్‌లోని సందీప్‌ మెహతా, ఫర్జండ్‌ అలీ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. భర్త జైలులో ఉంటే అతడి భార్య లైంగిక, భావోదేగ సమస్యలు ఎదుర్కొంటుందని, ఆమె మాతృత మధురిమలు అనుభవించాలనుకోవడం తప్పుకాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రత్యేకించి ఈ కేసులో పిటిషనర్‌ అమాయకురాలని, అందువల్ల ఏ కోణంలోంచి చూసినా ఈ సమస్యకు సురక్షిత పరిష్కారం అవసరమని వెల్లడించింది. అందువల్ల ఆమె కోరికగా లేదా హక్కుగా భావించినా తప్పుకాదని, అయితే విచిత్రమైన ఈ కేసుపై తీర్పు అన్నింటికీ వర్తించదని, ఏ కేసుకు ఆ కేసులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.

భర్త జైలుశిక్ష అనుభవిస్తున్నంత మాత్రాన భార్య సంతానప్రాప్తికి ఎందుకు దూరం కావాలని ప్రశ్నించింది. ఈ సందర్భంగా రుగ్వేదం, జుడాయిజం, క్రిస్టియానిటీ, అబ్రహామిక్‌ మతాలకు చెందిన గ్రంథాల్లోని కొన్ని అంశాలను తన తీర్పులో ప్రస్తావించింది. హిందూమతంలో కీలకంగా ప్రస్తావించిన 16 మతకర్మల్లో గర్భాదానం ఒకటని ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం సంతానప్రాప్తి ప్రాథమిక హక్కుగానే భావించాలని, అది ఖైదీలకూ వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. 2019లో ఓ కేసుకు సంబంధించి నందాలాల్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ భిల్వారా కోర్టు త ీర్పునివ్వగా అజ్మీర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గత ఏడాది ఒకసారి 20 రోజుల పెరోల్‌ పొందిన నందాలాల్‌ జైలులో అతడి ప్రవర్తన చక్కగా ఉందన్న నివేదికలను జోథ్‌పూర్‌ బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement