హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు పథకం అమలు కోసం పారామెడికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ద్వారా ఈ తాత్కాలిక నియామకాలు చేపడతారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకోసం డిసెంబరు 1న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 5న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 7న మెరిట్ జాబితా ముసాయిదా విడుదల చేసి మరుసటి రోజు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
వాటిని పరిష్కరించి పదో తేదీన తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్లకు నెలకు రూ.30వేల వేతనం ఇస్తారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలు ఏర్పాటు చేయనున్నారు. జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు రెండో విడత ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ ఉద్యోగానికి ఆ కోర్సులో రెండేళ్ల డిప్లమా చదవడంతోపాటు తెలంగాణ పారామెడికల్ బోర్డులో పేరును నమోదు చేసుకుని ఉండాల్సిందే.