భాగ్యనగరవాసులకు అదోక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. అదే ఆగష్టు 25 2007. హైదరాబాద్ నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల విషాదానికి నేటితో 14ఏళ్లు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్‌లో జంట పేలుళ్లు జరిగాయి. లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఈ పేలుళ్లలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా…. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
పేలుళ్ల తర్వాత సిటీలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు…19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు. పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరిలను ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ పేలుళ్లకు పాల్పడింది. కోర్టు శిక్ష ఖరారు చేసినప్పటికీ ఇప్పటి వరకు తీర్పు మాత్రం అమలు కాలేదు. ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులకు చర్లపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షకు ఖరారు చేసింది. A-1 హానిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయించిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉరిశిక్ష విధించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఈ జంటపేలుళ్ల వల్ల గాయపడిన కొందరు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఆనాటి భయంకర పరిస్థితులను గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. ఈ విషాదం జరిగి 14 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు బాధితులకు సాయం అందని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండిః పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. మండిపోతున్న బంగారం ధర