Saturday, November 23, 2024

విదేశాలకు పురాతన విగ్రహాల తరలింపు.. తంజావూరులో 14 విగ్రహాలు స్వాధీనం, నిందితుడి అరెస్టు

కోట్లాది రూపాయల విలువచేసే పురాతన దేవాతా మూర్తుల విగ్రహాలను విదేశాలకు అమ్మడానికి యత్నిస్తున్న ఓ ముఠాని తమిళనాడు పోలీసులు అరెస్టుచేశారు. తమిళనాడులోని ఐడల్ వింగ్ వలవేసి మరీ ఈ ముఠాని పట్టుకుంది. తంజావూరులోని ఆర్ట్స్ గ్రామంలో షాపు నడుపుతున్న వ్యక్తిని తొలుత అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కోట్ల విలువైన 14 పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆ విగ్రహాలను విదేశాలకు పంపడానికి క్లియరెన్స్ కోరుతూ 2017లో ఆర్కియాలజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (ASI) ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వీటిలో రిషభదేవ, శివగామి అమ్మన్, మహావీరుల విగ్రహాలున్నాయి.  

అవి పురాతన దేవతామూర్తుల  విగ్రహాలుగా అనుమానించడంతో ఆర్కియాలజికల్​ డిపార్ట్​మెంట్​ వాటిని తిరస్కరించింది. అంతేకాకుండా అవి ఎక్కడి నుంచి సేకరించారో తెలుసుకునేది ఓ టీమ్​ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తంజావూరులోని శివాజీ నగర్‌లో ఆర్ట్ విలేజ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసిన గణపతి గురించి విగ్రహ విభాగానికి తెలిసింది. అతను దేశంలో,  విదేశాలలో విక్రయించడానికి కొన్ని పురాతన విగ్రహాలను దాచిపెట్టాడని కనుగొన్నారు.

తదనంతరం ఆ విగ్రహాల విభాగం చీఫ్ సీఐడీ డీజీపీ డాక్టర్ జయంత్ మురళి ఒక బృందంతో కలిసి నిందితుడిని పట్టుకోవడానికి ప్లాన్ వేశారు. దాచి ఉంచిన పురాతన విగ్రహాలను కనుగొనడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సోదాలు నిర్వహించి రహస్య ప్రదేశంలో దాచిన 14 పురాతన విగ్రహాలను వెలికితీశారు. అయితే.. విగ్రహాలు కలిగిన వ్యక్తి వాటి మూలాలు ఎక్కడివి అనే విషయాలను మాత్రం తెలియజేయడం లేదు. అంతేకాకుండా వాటికి చట్టపరమైన పత్రాలు లేవని విచారణలో తేలింది.

అదే విగ్రహాలను 2017లో క్లియరెన్స్ కోసం ASIకి సమర్పించినట్లు కూడా వారి ఎంక్వైరీలో తెలిసింది. నిందితుడైన గణపతికి ఎటువంటి అధికారిక డాక్యుమెంటేషన్ లేకుండా పురాతన విగ్రహాలను దాచిపెట్టాడని, సరైన వివరణ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీనిపై నిందితుడిని ప్రశ్నిస్తున్నారు అని విగ్రహ విభాగం తెలిపింది. మిగిలిన నిందితులను ట్రాక్ చేసిన తర్వాతే స్వాధీనం చేసుకున్న విగ్రహాల వాస్తవ నిరూపణకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని సీఐడీ చీఫ్​ అంటున్నారు. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో అనేక వందల కోట్ల విలువైన 14 విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడు గణపతిని రిమాండ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement