Wednesday, November 20, 2024

Kushinagar Tragedy: పెళ్లింట పెను విషాదం.. బావిలో పడి 13 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహానికి హాజరైనవారు ప్రమాదవశాత్తూ పాడుబడిన బావిలో పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఖుషినగర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివాహానికి ముందు నిర్వహించిన హల్దీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడుబడిన బావి పైకప్పుపై వీరంతా కూర్చుని ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పైకప్పు శిథిలావస్థలో ఉండటంతో కూలిపోయిందని తెలిపారు. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఏడుపులు, రోదనలతో మిన్నంటింది. బావిలో పడిపోయినవారిని బయటకు తీసి చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 

మరోవైపు ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement