కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలో రోజూ మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు వ్యాక్సిన్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో దేశంలో వ్యాక్సిన్‌కు డిమాండ్ భారీగా ఏర్పడింది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ డోసులకు మధ్య వ్యవధిని పెంచే ప్రయత్నంలో ఉంది కేంద్రం. తొలి డోస్ వేసుకున్న వారు రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవధిని అమాంతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.
సీరం కంపెనీకి చెందిన కోవీషీల్డ్ తొలి డోస్ కూ రెండో డోస్ కు మధ్య వ్యవధిని ఏకంగా 16 వారాలకు పెంచాలని నిర్ణయించారు. నాలుగు నుంచి ఆరు, ఎనిమిది వారాలు అని చెప్పారు. ఇప్పటివరకు ఈ గ్యాప్ 4 నుంచి 6 వారాలు ఉంది. కానీ దీన్ని 12 నుంచి 16 వారాలు పెంచాలని ఈ కమిటీ సూచించింది. ప్రస్తుతం తొలి డోస్ తీసుకున్న తర్వాత 6 నుంచి 8 వారాలు విరామం పాటిస్తుండగా.. ఇకపై 12 నుంచి 16 వారాలకు పెంచాలని జాతీయ వ్యాధినిరోధక సాంకేతిక సలహా బృందం సూచించింది. కొవాగ్జిన్ వ్యవధిలో మాత్రం మాత్రం ఎటువంటి మార్పులను సూచించలేదు.
అంతేకాదు, గర్బిణీలు కూడా టీకా వేసుకోవచ్చని , ప్రసవం తర్వాత బాలింతలు కూడా ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, కరోనా నుంచి కోలుకున్నవారు ఆరు నెలల తర్వాత టీకా వేయించుకోవాలని సూచించింది. ఈ సిఫార్సులు ఆమోదానికి ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించే జాతీయ నిపుణుల బృందానికి పంపనున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ విరామంపై మూడు నెలల్లో సిఫార్సు చేయడం ఇది రెండో సారి. తొలిసారిగా మార్చిలో 28 రోజుల నుంచి 6-8 వారాలకు పెంచడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇప్పుడు 16 వారాలు అయినా ఫర్వాలేదంటున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ గడువులు పెంచుతున్నారని తెలుస్తోంది.