111 జీవో ఎత్తివేతపై ఎన్జీటీకి వెళ్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. 111 జీవో ఎత్తివేత వెనుక ఇంటర్నర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. 111 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నారు. భూములు కొనుగోలు చేశాక జీఓ ఎత్తివేశారన్నారు. 2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో భూముల క్రయ విక్రయాల వివరాలు బయటపెట్టాలన్నారు. ఔటర్ రింగురోడ్డును ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు అమ్మారన్నారు. ఓఆర్ఆర్ ను అప్పనంగా ప్రైవేటు కంపెనీకి అప్పగించారన్నారు. సింగపూర్ సంస్థ ఫ్రంట్ ఎండ్ లో ఉండి వాటా కొనుగోలు చేసిందన్నారు.
ఎల్లుండి లోపు ఐఆర్బీ సంస్థ 10శాతం హెచ్ఎండీఏ కు చెల్లించాలని… లేకపోతే టెండర్ వెంటనే రద్దు చేయాలన్నారు. 10శాతం కట్టకుండానే ఎందుకు పొడిగింపు ఇస్తున్నారని అన్నారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ తతంగమంతా నడిపిస్తున్నారన్నారు. అరవింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ కు తాబేదారా అని అన్నారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే హెచ్ఎండీఏను ముట్టడిస్తామన్నారు. ఈడీ, కాగ్ సంస్థలకు తమ దగ్గరున్న సమాచారం ఇస్తామన్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కిషన్ రెడ్డి మాట్లాడి వదిలేశారన్నారు.