Friday, November 22, 2024

Flash: అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవదహనం.. గోడౌన్‌లో అసలేం జరిగింది ?

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో కాలిపోయి 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు.ఎటూ వెళ్లలేని స్థితిలో అక్కడే మరణించారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం… బోయిగూడలోని ఓ స్క్రాప్ గౌడౌన్‌లో మంటలు చెలరేగినట్లు తెల్లవారుఝామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మొదట రెండు అగ్నిమాపక యంత్రాలను పంపించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరో ఆరు ఫైరింజన్లను పంపించారు. మంటలను కొంత వరకు అదుపుచేసిన తర్వాత.. లోపలికి వెళ్లారు. గోడౌన్ పై అంతస్తులో రెండు గదులు ఉన్నాయి. కిందకు వెళ్లేందుకు ఇనుప మెట్ల మార్గం ఒక్కటే ఉంది. అక్కడ పనిచేసే కార్మికులు ఈ రెండు గదుల్లోనే నివసిస్తారు.

రాత్రి పనులు పూర్తైన తర్వాత కార్మికులంతా తమ గదుల్లో నిద్రపోయారు. రాత్రి 02.30 గంటల సమయంలో గౌడౌన్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ ఖాళీ బీరు సీసాలు, వైర్లు ఎక్కువగా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. వైర్లకు వేగంగా మంటలు అంటుకోవడంతో.. పెద్ద అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే.. గోడౌన్ మొత్తం మంటలు వ్యాపించాయి. పైన ఉన్న కార్మికులు కిందకు వెళ్లే అవకాశమే లేకపోయింది. వారంతా ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో.. ముందు వైపు ఉన్న గది నుంచి చివరి గదిలోకి వెళ్లారు. ఆ గదిలోనే మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. ఒకరిపై మరొకరు పడి ఉన్నారని.. మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా ఉన్నాయని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. మృతులంతా బీహార్‌కి చెందిన వారిగా సమాచారం.

గోడౌన్ లోపల కార్మికులు ఉన్నారన్న విషయం మొదట ఫైర్ ఫైటర్స్‌కి తెలియదు. అగ్నిప్రమాదం జరిగిందని మాత్రమే తెలుసు. మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి చూస్తే మృతదేహాలు కనిపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఒకటి దాని తర్వాత ఒకటిగా మొత్తం 11 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు వెల్లడించారు. వాటిని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది గోడౌన్‌లో ఉన్నారు. వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు చెలరేగిన వెంటనే.. ఆ వ్యక్తి కిటికీ నుంచి బయటకు దూకాడు. స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని.. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా.. ఇంకేదైనా కోణముందా? అనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. నగరంలో ఇలాంటి అనుమతులు లేని స్క్రాప్ గౌడౌన్‌లో ఎన్ని ఉన్నాయన్న దానిపై వివరాలు సేకరిస్తున్నామని.. వాటిని తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement