తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. రోజువారీ కేసల సంఖ్య వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం రేపుతోంది. ఉస్మానియాలో విధులు నిర్వహిస్తున్న 11 మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. గత రెండు రోజులుగా హౌస్ సర్జన్‌లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులకు పాజిటివ్ అని తేలింది. దీంతో వారందరిని హోం ఐసోలేషన్ కు తరలించారు.
మరోవైపు తెలంగాణలో నిన్న 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కొత్త కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు నమోదు అయ్యాయి. అదే సమమంలో 330 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,042కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇందులో 6,76,466 మంది బాధితులు ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital