Tuesday, November 26, 2024

వందేళ్ల హేతువాద ఉద్యమ హిమాద్రి ‘రావిపూడి వెంకటాద్రి’…

శ‌త సంవ‌త్స‌ర జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌త్యేక క‌థ‌నం

ఆంధ్రదేశంలో హేతువాదిగా, మానవవాదిగా లబ్ధప్రతిష్ఠులైన శ్రీ రావిపూడి వెంకటాద్రి గారు 2021 ఫిబ్రవరి 9 వ తేదీన 99 సంవత్సరాలు నిండి 100 వ ఏట ప్రవేశించారు. ఆయన 1922 వ సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన అప్పటి గుంటూరు జిల్లా (నేటి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ) నాగండ్ల గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. స్ఫురద్రూపిగా, ఆజానుబాహుడైన యువకునిగా ఆయన మొదట్లో నాటకరంగం వైపు ఆకర్షితులై శ్రీకృష్ణ పాత్రధారణకు పేరొందారు. అయితే క్రమంగా కవిరాజు త్రిపురనేని భావజాలం ప్రభావంతో ఆయన హేతువాదం వైపు మొగ్గి, తాను స్థాపించిన కవిరాజాశ్రమం ద్వారా హేతువాద భావాల వ్యాప్తికి అనంతరకాలంలో అహర్నిశలూ కృషిచేశారు. 1945లో యం. యన్. రాయ్ భావాలతో ప్రభావితులై, రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. భారత హేతువాద సంఘానికి, ఆంధ్రప్రదేశ్ రాడికల్ హ్యూమనిస్టు సంఘానికీ ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నారు.

ఆంధ్రదేశంలో శాస్త్రీయ, తాత్త్విక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విస్తృతంగా ప్రచారం చేసిన అతి కొద్దిమందిలో శ్రీ వెంకటాద్రి గారొకరు. శాస్త్రం- మతం, హేతువాదం – నాస్తికత్వం, మార్క్సిజం – హ్యూమనిజం లకు సంబంధించి అందరినీ ఆలోచింపజేసే తెలుగు, ఆంగ్ల రచనలు ఇప్పటివరకూ 80 కి పైగా వీరు చేశారు. 1982 లో ఆయన స్థాపించిన హేతువాది మాసపత్రికకు నేటి వరకూ తానే ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా రాజీలేని హేతువాదిగా, శాస్త్రీయ భౌతికవాదిగా, మానవవాదిగా తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా, శిక్షణా శిబిరాలలో అధ్యాపకునిగానూ అవిరళ కృషి చేస్తున్నారు. 1988లో కవిరాజు త్రిపురనేని అవార్డు, 1996 లో తాపీ ధర్మారావు అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారాయన. 1993 లో వివిధ సాంస్కృతిక సంస్థల ఆహ్వానం పై అమెరికాలో రెండు నెలల పాటు పర్యటించారు. 1996 లో కవిరాజు త్రిపురనేని జాతీయ అవార్డు అందుకున్నారు. రేషనలిస్ట్ పేరిట వెలువడుతున్న ఆంగ్ల త్రైమాసిక పత్రికకు అయన సంపాదకులుగా ఉన్నారు. ఎన్నో సన్మానాలు, మరెన్నో అవార్డులు అందుకున్న శ్రీ రావిపూడి గురించి తెలియనివారు ఆంధ్రదేశంలో చాలా అరుదంటే అతిశయోక్తి కాదు. జ్ఞాన పునర్వికాసోద్యమం ద్వారా సమగ్ర భావ విప్లవం కోసం, తద్వారా నవ్యమానవ సమాజ నిర్మాణం కోసం కృషి చేయడం తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారాయన. ప్రస్తుతం వెంకటాద్రి గారు చీరాలలో తమ పెద్ద కుమార్తె వద్ద ఉంటూ ఈ నాటికీ తాను ఎంచుకున్న జీవిత లక్ష్యానికి అనుగుణమైన రచనా వ్యాసంగాన్ని అతి ఇష్టంగా, శ్రద్ధతో కొనసాగిస్తూ ఉండడం విశేషం. నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన జీవితం గడుపుతున్న ఆ నిస్వార్థ, నిరాడంబర నేతను మనమంతా ఆదర్శంగా తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement