Friday, November 22, 2024

వరి పోరు :- 100శాతం వడ్లు కొనాల్సిందే.. కేంద్రంపై నిరసనలకు ప్లాన్ చేస్తున్న టీఆర్ఎస్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్యగా మారిన వరి ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోసారి కేంద్రంపై ఉధృత పోరాటానికి సన్నద్ధమవుతోంది.వరి ధాన్యం కొనుగోళ్లలో ఏకరీతి విధానం అమలు చేయాలని కోరుతూ కేంద్రం మెడలు వంచాలని, అందుకు ఉద్యమ పంథాలో చట్ట సభల్లో, బైటా పోరు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సోమవారం ఈ మేరకు ఆందోళనా కార్యక్రమాల రూపకల్పనకు సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీకి నిర్ణయించారు. ఈ సమావేశానికి ఆహ్వానితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రులతో కూడిన బృందం ఢిల్లికి వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీతో భేటీ కావాలని నిర్ణయించారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని కేంద్రం 100శాతం కొనుగోలు చేస్తున్నందున తెలంగాణ ధాన్యాన్ని కూడా 100శాతం పంజాబ్‌ తరహాలో ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలు, ధర్నాలతోపాటు, రాజ్యసభ, లోక్‌సభలలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శనివారం మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంతోపాటు, కేంద్ర వైఖరి, ఇతర పాలనాపరమైన అంశాలను ఆయన ఈ సందర్భంగా మంత్రులతో చర్చించారు. తాజా శాసనసబా బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించినట్లుగా ఉద్యోగ భర్తీకి వీలుగా నోటిఫికేషన్ల జారీ, వ్యవసాయం, రానున్న సీజన్‌లో పంటల దిగుబడి, కొనుగోలుకు అనుసరించాల్సిన మార్గాలు వంటి తదితర అంశాలను ఆయన కీలకంగా చర్చించారు. నోటిఫికేషన్లకు పట్టే సమయంతోపాటు, నియామకాల షెడ్యూల్‌, నియామక సంస్థలకు అప్పగించాల్సిన బాధ్యతల విధివిధానాలు, శాఖల వారీగా ఖాళీలు, పదోన్నతులు, పరీక్షా నిర్వహణకు పట్టే సమయం వంటి వాటిపై సుధీర్ఘంగా చర్చించారు.

సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో పండే వరిధాన్యం కేంద్రమే ఖచ్చితంగా కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో దర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు ఈ భేటీలో రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సమావేవంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఆందోళనా కార్యక్రమాలతోపాటు, ఢిల్లికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రుల బృందం వెళ్లి కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధాని మోడిని కూడా కలవాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ప్రధానితోపాటు, పలువరు కేంద్ర మంత్రులకు తమ డిమాండ్‌ను వినిపించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని కేంద్రం 100శాతం కొనుగోలు చేస్తున్నందున తెలంగాణ ధాన్యాన్ని కూడా 100శాతం పంజాబ్‌ తరహాలో ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

కాగా శనివారం అత్యవసరంగా సీఎం కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్గౌడ్‌, జగదీష్‌రెడ్డి, ఇంద్రకరన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌లు హాజరయ్యారు. ఎంపీ సంతోష్‌కుమార్‌, సీఎస్‌ సోమేష్‌కుమార్‌లతోపాటు ఎమ్మెల్సీ కవితలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల21(సోమవారం)న జరగనున్న టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, డ్పీ చైర్మన్లు, డీసీసీబి, డీసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబందు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ప్రధానంగా వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని ఢిల్లి వేదికగా నిరసించేందుకు సోమవారంనాటి ఎల్పీ భేటీలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని రకాల పోరాటం చేస్తానని ఇదివరకే సీఎం కేసీఆర్‌ పలు వేదికలపై ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే పార్లమెంట్‌ను దద్దరిల్లేలా చేస్తామని, తెలంగాణ క్యాబినెట్‌, ప్రజాప్రతినిధులు ఢిల్లిdలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. పంజాబ్‌లో ధాన్యం మొత్తం కొని తెలంగాణలో కొనకుండా రాజకీయం చేస్తున్నారని గతంలోనూ ధ్వజమెత్తారు. అదేవిధంగా పెట్రోల్‌, డీజిల్‌పై తాము ఒక్క రూపాయి వ్యాట్‌ పెంచలేదని, కానీ కేంద్రం సెస్‌ పేరుతో పాల్పడుతున్న దోపిడీ రద్దు చేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్‌ చేయనున్నారని సమాచారం, ఈ సందర్భంగానే వీలైతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అంశం మరోసారి తెరపైకి తేనున్నారని తెలిసింది. ఢిల్లిdలో నిరసన కార్యక్రమాలు, సంప్రదింపుల సందర్భంగా విభజన చట్టం ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలను తెరపైకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సమాయత్తం అవుతున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతోపాటు, నవోదయ పాఠశాల వంటి అంశాలను ఈ దఫా ప్రధానంగా డిమాండ్‌ చేసి కేంద్రాన్ని ఇరుకునపెట్టాలనే యోచనతో ఆయన వ్యూహరచన చేస్తున్నారని సమాచారం.
ఇదివరకే సీఎం కేసీఆర్‌ గత సీజన్‌లో కేంద్ర ఉదాసీన వైఖరిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తామే ధర్నాలు చేసి ఉత్తర భారత రైతాంగానికి అండగా ఉంటామని ఆయన చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. వరి ధాన్యం కొనుగోళ్ల అంశంతోపాటు ఇతర సమస్యలైన నీళ్ల వాటాను సెక్షన్‌ 3 కింద తేల్చాలనే డిమాండ్‌ను జాతీయ స్థాయిలో వినిపించేలా ఆయన సిద్దమవుతున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 80శాతం బాయిల్డ్‌ రైస్‌, 20శాతం నార్మల్‌ రైస్‌ తీసుకుంటామన్న కేంద్ర హామీలు 20లక్షల టన్నులకే పరిమతమైందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ దిశలోనే యాసంగిలో వరి నాట్లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి విజ్ఞప్తి చేసింది. ఈ దఫా ఢిల్లి టూర్‌ ద్వారా ప్రజలకు ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకునే బాధ్యత కేంద్రానిదేననే వాదనను ఆయన ప్రధానంగా తెరపైకి తేనున్నారు. కేంద్రం బాధ్యతారాహిత్యాన్ని ఆయన జాతీయ స్థాయిలో ఎండగట్టేలా ప్రణాళికను రూపొందించుకుంటున్నారు.

ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో తెలంగాణ రైతు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారింది. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉండాలని., దేశంలోని అన్ని రాష్ట్రాలకు ధాన్యం సేకరణ విషయంలో ఏకరీతి విధానాన్ని అనుసరించాలని, ” సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం” కోసం పార్లమెంటులో డిమాండ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీలను గత డిసెంబర్‌లో ఆదేశించారు. తెలంగాణ వరిధాన్య సేకరణలో స్పష్టత కోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్‌ సభ సభ్యులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌, లోక్‌సభలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసి త్వరలో అమలు చేయనున్నారు. ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానం తెలంగాణ రైతాంగానికి, మరోవైపు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని, ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు.

- Advertisement -

గడచిన డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు, తెలంగాణ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లికి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్జప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంపై టిఆర్‌ఎస్‌ సీరియస్‌గా ఉంది. యాసంగి పంటకాలం ప్రారంభమైన నేపథ్యంలో, తెలంగాణ రైతులు వరినాట్లకు సిద్ధమౌతున్న పరిస్థితుల్లో వచ్చే యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంపై అనిశ్చితిని తొలగించాలని, యాసంగి వరిధాన్యాన్ని ఎంతమేర కొంటరో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. వార్షిక ధాన్యసేకరణ క్యాలండర్‌ను విడుదల చేయాలని ఢిల్లిdలో తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టేందుకు సిద్దమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement