– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
తెలంగాణలో ప్రజా సమస్యలను వదిలేసి వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు బీజేపీ నేతలు. అయితే.. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు తెలుస్తుండడంతో ఎవరు ఏంటనే విషయాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పేదల బతుకులను బజారులో పడేసేలా విపరీతంగా ధరలు పెంచి దండకాలు మొదలిట్టిన విషయాన్ని సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. అంతేకాకుండా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, వంట నూనెల ధరల పెంపు, గ్యాస్ సిలెండర్ ధరల పెంపు, నిత్యావసరాల ధరల పెంపుతో పాటు ప్రతి వస్తువు మీద జీఎస్టీ రూపంలో అదనంగా కేంద్రం దండుకుంటున్న విషయాన్ని పూస గుచ్చినట్టు ప్రజలకు తెలియజేస్తోంది మీడియా.
ఇక.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామా కారణంగా జరగనున్న ఉప ఎన్నికలో మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ముందంజలో ఉంది. త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో సెప్టెంబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని అధికార పార్టీ యోచిస్తోంది. దీనిని ప్రతిష్టాత్మక పోరుగా భావించి, మరో ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని గెలవకుండా ఆపేందుకు మునుగోడు మిషన్‌ను సాధించేందుకు టీఆర్‌ఎస్ ఏ అంశాన్ని వదలదల్చుకోలేదు.
2020, 2021లో టీఆర్‌ఎస్ నుంచి దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీజేపీ.. ఈ సారి జరిగే ఉప ఎన్నికతో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు పోటీని ప్రధాన పార్టీలు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆగస్టు 21న మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన బహిరంగ సభలో కేఆర్పాల్ అధికారికంగా బీజేపీలో చేరారు. అయితే.. బీజేపీ కార్యక్రమానికి ఒకరోజు ముందు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్‌రావు 100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఈ నేతలు సెప్టెంబర్ 15 నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు. పార్టీ ‘50 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ను సిద్ధం చేసి ముందడుగు వేస్తోంది.
రాబోయే 50 రోజుల్లో అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలను కవర్ చేయడానికి టీఆర్‌ఎస్ పార్టీ 1,500 మంది నాయకులు.. కార్యకర్తలతో విస్తృత ప్రచారం చేపట్టనుంది. భారత ఎన్నికల సంఘం (ECI) సెప్టెంబరు నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటిస్తుందని, అక్టోబరు నెలాఖరులోగా ఉప ఎన్నిక నిర్వహించవచ్చని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. తెలంగాణ బాపుగా పేరుగాంచిన కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేతలతో సమావేశమై పార్టీ వ్యూహాన్ని రూపొందించారు. మునుగోడులో పార్టీ ప్రచారానికి ఇన్చార్జిగా మంత్రి జి. జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పని చేస్తారని ప్రకటించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రెండు గ్రామాల్లో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నియోజకవర్గంలో 88 మంది ఎమ్మెల్యేలు మకాం వేసే చాన్సెస్ ఉన్నాయి. అధికార పార్టీకి 103 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీల బలం ఉంది. వారిలో కనీసం 100 మంది సేవలను ఈ ఉప ఎననిక ప్రచారం కోసం ఉపయోగించుకోనున్నారు. వీరికి 100 యూనిట్లలో (గ్రామాలు లేదా వార్డులు) ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ 15 మంది పార్టీ సభ్యులను మునుగోడుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లు, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. నాయకులు వివిధ పథకాల కింద సహాయాన్ని కూడా పంపిణీ చేసే అవకాశాలున్నాయి. కాగా, కాంగ్రెస్ తరహాలో టీఆర్‌ఎస్ కూడా ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించలేదు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తున్న బీజేపీ మునుగోడుపై దృష్టి సారించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల విజయాన్ని పునరావృతం చేసి 2023 ఎన్నికలలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కాషాయ పార్టీ చూస్తోంది.
ఇక.. 2019లో హుజూర్‌నగర్ సీటును నిలబెట్టుకోవడంలో విఫలమై, గతేడాది టీఆర్‌ఎస్ నుంచి నాగార్జున సాగర్‌ను చేజిక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం తహతహలాడుతోంది. 2019లో లోక్‌సభకు ఎన్నికైన తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. దీంతో హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన నాగార్జున సాగర్ స్థానం కూడా ఖాళీ అయ్యింది. ఈ రెండు స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 2018 ఎన్నికల తర్వాత డజను మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్ నుంచి బీజేపీ చేజిక్కించుకున్న దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 2020లో దుబ్బాక ఉప ఎన్నికకు కారణమైన సోలిపేట రామలింగారెడ్డి భార్య, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్. సుజాతపై 1,079 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీకి చెందిన రఘునందన్ రావు గెలుపొందారు.
2018 ఎన్నికల్లో 119 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీకి ఈ విజయం కొత్త విశ్వాసాన్ని ఇచ్చింది. కొందరు రైతుల భూములను ఆక్రమించారనే ఆరోపణలతో కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. రాజేందర్ హుజూరాబాద్ స్థానానికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. నియోజకవర్గంలో రాజేందర్‌కు ఉన్న పాపులారిటీతో బీజేపీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
అయితే.. రాజేందర్ లాగానే రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడులో భారీ విజయాన్ని సాధించి వచ్చే ఏడాది ఎన్నికలలో తమ అవకాశాలను పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. వారి మిషన్ 2023 కోసం ఉప ఎన్నికల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కాషాయ పార్టీ కేంద్ర అగ్ర నాయకులను మోహరించే అవకాశం ఉంది. జులైలో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ నిర్వహణ, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించిన భారీ బహిరంగ సభ ఇప్పటికే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచినట్టు వారు భావిస్తున్నారు. దీంతో మరింత ఫోర్సుగా రాష్ట్రంలో స్వరాన్ని పెంచి, టీఆర్‌ఎస్ లీడర్లపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య తరుచూ మాటల యుద్ధం కొనసాగుతోంది.