హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్న వేళ రాష్ట్రంలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. దీంతో కరోనా నాలుగో వేవ్ విరుచుకుపడినా ఇక ఏమి కాదని వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 14 నెలల రికార్డు సమయంలోనే 18ఏళ్లు నిండిన వారందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయింది. 18ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 2, 77, 67000 మంది ఉండగా వారందరికీ మొదటి, రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. మొదటి డోస్ వ్యాక్సినేషన్ అయితే ఏకంగా 106శాతం మేర పూర్తయింది. కరోనా మొదటి వేవ్ సమసిపోయిన తర్వాత… రెండో వేవ్ విరుచుకుపడుతున్న విపత్కర పరిస్థితుల్లో 2021జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. ముందుగా 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సినేషన్ కొనసాగించారు. ఆ తర్వాత క్రమక్రమంగా 18ఏళ్లు పైబడిన అర్హులందరికీ వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక 15-17ఏళ్ల లోపు చిన్నారులకు మొదటి డోస్ 89శాతం మందికి, రెండో డోస్ 70శాతం మందికి పూర్తయింది. ప్రస్తుతం 12-14 ఏళ్లలోపు చిన్నారులకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా రోజుల వ్యవథిలోనే 67శాతం మందికి వ్యాక్సిన్ వేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయినందున ఇక నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొవచ్చన్న ధీమాను వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి బీఏ.2 వేరియంట్ కారణంగా చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ విరుచుకుపడుతోంది. అయితే మన దేశంలో థర్డ్ వేవ్ బీఏ.2 వైరస్ వేరియంట్ కారణంగానే సంభవించిందని, అప్పటికే రాష్ట్రంలో రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయినందున ఒమిక్రాన్ ప్రభావం చూపించలేకపోయిందని చెబుతున్నారు. మరోవైపు ఒమిక్రాన్ విరుచుకుపడినపుడే ప్రజల్లో సహజసిద్ధంగా కరోనా యాంటీబాడీలు పెరిగాయంటున్నారు.