హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఫ్లో మహిళా పారిశ్రామిక పార్కును కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఫ్లో) ప్రమోట్ చేసిన ఈ ఇండస్ట్రియల్ పార్కు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. అవసరమైతే ఈ పార్కుకు మరో 100 ఎకరాలు కేటాయించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్ అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన వీ హబ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారు. వీ హబ్ సందర్శించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. వీహబ్ ఇప్పటికే 2,194 స్టార్టప్‌లను రూపకల్పన చేసిందన్నారు. ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. స్టార్టప్ నిధులతో 2,800 మందికి ఉద్యోగాలు సృష్టించామని పేర్కొన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఉద్యామిక…
దేశంలో తొలిసారి మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఉద్యామిక అనే కొత్త కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వారి ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యామికలో భాగంగా సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ద్వారా ప్రాసెస్, రివ్యూ, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. సులభతర వాణిజ్యానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు కావాలన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులతో పురోభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నాన’ని కేటీఆర్ పేర్కొన్నారు.
టీఎస్ఐపాస్ ద్వారా వేగంగా అనుమతులు…
టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 18 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రయివేటు రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన కల్పించామన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించే కేంద్రంగా హైదరాబాద్ మారిందన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్ కేర్ రంగంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ ఆఫ్ ఇండియాగా మారిందని కేటీఆర్ తెలిపారు. పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఇవిఎన్ రెడ్డి, ప్లో నేషనల్ ప్రెసిడెంట్ ఉజ్వల సింఘానియా, ఫ్లో హైదరాబాద్ అధ్యక్షురాలు చిగురుపాటి ఉమ పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
ఈ పార్కు మా కల…. ఫిక్కీ ఫ్లో హైదరాబాద్ చాప్టర్ ఉమా చిగురుపాటి…
ఈ ఇండస్ట్రియల్ పార్కు మా కల. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిజమైంది. పార్కు ప్రారంభ సమయంలోనే 25 గ్రీన్ ఇండస్ట్రీలు స్టార్టయ్యాయి. ఈ పార్కు 1600 ఉద్యోగాలు సృష్టించనుందని ఉమా చిగురుపాటి తెలిపారు. ఫిక్కీలో ఒక డివిజన్‌గా 1983లో ఫ్లో ఏర్పడింది.