కరోనా కేసుల పెరగుదల తీవ్రత ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు కేసుల పెరుగుదల డెంజర్ బెల్స్ ను మోగిస్తోంది. దీంతో మహారాష్ట్రలో ని బీడ్ జిల్లాలో ఇప్పుడు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. కరోనా కట్టడికి ఇప్పటికే ఆ జిల్లాలో నైట్ కర్ఫ్యూ విధించారు. యినప్పటికీ కరోనా రోగుల సంఖ్య నియంత్రణలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీడ్ కలెక్టర్ మీడియాకు తెలిపారు. రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు .దీంతో జిల్లాలో అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ ఉంటాయన్నారు. ఇక ఇప్పటికే నాందెడ్ జిల్లాలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయించారు.
లాక్‌డౌన్ విధించడంతో నాందేడ్ జిల్లాల్లో రవాణ వ్యవస్థపై కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై ప్రభావం పడింది. వాహనాల అనుమతిపై నిషేధం విధించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులపై కూడా ఆంక్షలు విధించారు. అయితే నాందేడ్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్‌టీసీ బస్సులకు మాత్రం జిల్లా నుంచి వెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు.