తెలంగాణలో ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 38 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో 10 రోజుల లాక్ డౌన్ విధించారు. అయితే, ఇది రాష్ట్రవ్యాప్తంగా మాత్రం కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 10 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ ను విధించారు.
ఇటీవల ఈ గ్రామంలోకి దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్ తెలింది. అయితే ఆ వ్యక్తి అదే గ్రామంలో దాదాపు 62 మందితో ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారు. దీంతో ఆ 62 మందిని అధికారులు ఇప్పటికే హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తల్లి, భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి శాంపిల్స్ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. అయితే, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పది రోజుల పాటు కఠిన లాక్ డౌన్ అమలు చేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. దీంతో ఆ గ్రామంలో దుకాణాలు, బడులుతో పాటు జనాలు గుంపులుగా ఉండే ప్రదేశాలన్నీ కూడా మూసివేశారు.
మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా 14 మందికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital