దేశంలో కొవిడ్ విలయ తాండవం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజువారి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,61,736 మంది మహమ్మారి బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 879 మంది బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. కొవిడ్ సోకిన వారిలో 97,168 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కి చేరుకుంది. భారత్‌లో ఇప్పటి వరకు 1,22,53,697 మంది కోవిడ్ నుంచి కోలుకోగా…ప్రస్తుతం 12,64,698 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 14 లక్షల 122 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఒక్కరోజే 40.04 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 10.85 కోట్ల డోసుల్ని పంపిణీ చేసినట్టు తెలిపింది.
మహారాష్ట్రాలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 51,751 కేసులు నమోదు అయ్యాయి. నిన్న 63,294 కేసులు నమోదు కాగా.. ఇవాళ స్వల్పంగా తగ్గాయి. నిన్న ఒక్కరోజే 258 మంది మృతి చెందారు. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.