చిత్తూరు: మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న రోజే వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి సొంతపార్టీ నేతలపై విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కొందరు నేతలు పనిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నగరి, పుత్తూరులో 14 మంది రెబల్స్‌ను వారు బరిలోకి దింపారని, రెబల్స్ గెలిచేందుకు పెద్దఎత్తున డబ్బు పంపిణీ చేశారని రోజా ఆరోపించారు. గతంలో తన ఓటమికి పనిచేసిన వారు ఇప్పుడూ అదే పనిచేస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై ఎన్నికల తర్వాత వేటు ఉంటుందని రోజా హెచ్చరించారు.
కాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా పరిధిలోని రెండు మున్సిపాలిటీలలో ఏకగ్రీవాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. నగరి మున్సిపాలిటీలో 29 వార్డులకు 7 మాత్రమే రోజా ఏకగ్రీవం చేసుకోగలిగారు. మిగిలిన అన్ని వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదే నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ పుత్తూరులోని 27 వార్డులలో ఒకటి మాత్రమే ఏకగ్రీవం కాగా.. మరో 26 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.