కోవిడ్ రెండవదశ విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరిలో భాగమైన విద్యావలంటీర్లు… మరీ తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ పరిస్ధితి అధ్వానంగా ఉందని ప్రైవేట్ టీచర్లు దీనవదనాలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యావలంటీర్ల పరిస్ధితి అగమ్య గోచరమైంది. సూర్యాపేట జిల్లాలో 250 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇందులో నాన్ టీచింగ్, టీచింగ్ కలిపి సుమారు 2,628 మంది ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు. కరోనా వేళ ఇబ్బందులు తాళలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంకొందరు కూరగాయలు ఆమ్ముకుంటూ బతుకునీడుస్తున్నారు. ఈ ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులకు నెలకు 2వేలు, 25కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించడం ఆ కుటుంబాలకు కొంత ఊరటనిచ్చింది. మరి తమ పరిస్థితి ఏమిటని విద్యావలంటీర్లు వాపోతున్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు మాత్రమే అర్హులు. అయితే స్కూల్ యజమానులు అధికారికంగా ట్రైనింగ్ చేసిన వారి సర్టిఫికెట్లు పెట్టి అనుమతులు తీసుకొని అనధికారికంగా ఇతర టీచర్లను పెట్టుకొని నడిపేస్తున్నారు. వాస్తవంగా రికార్డుల ప్రకారం ఆన్ లైన్ చేస్తే ప్రస్తుతం పనిచేసే టీచర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు రావు. అసలు సర్టిఫికెట్లు ఉన్న వారి పేర్లు ఆన్‌లైన్ చేస్తే నిజంగా పనిచేసే వారికి అన్యాయం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలల రంగు బయటపడే ప్రమాదం ఉంది. చాలా మంది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ట్రైనింగ్ లేని ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్న విషయం సాధారణమే. దీంతో ప్రభుత్వ సహాయం పొందాలంటే ప్రైవేట్ టీచర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాల్లో క్రాప్ట్, డ్రాయింగ్ టీచర్లుగా పనిచేస్తున్న తమను కూడా ఆర్ధికంగా ఆదుకోవాలని వలంటీర్లు కోరుతున్నారు. ప్రభుత్వ ఉపాద్యాయులతో సమానంగా పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న తమపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆవేదన చెందుతున్నారు. తమకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు బంద్ కావడం.. స్కూల్ భవనాల కిరాయిలు… కరెంట్ బిల్లులు.. స్వీపర్లు… నైట్ వాచ్ మెన్‌లు తదితర వాటి బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల నుంచి ఆర్ధికంగా అవస్థలు పడుతున్నారు. తెచ్చిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా యాతనలు పడుతున్నారు. మరోవైపు కరోనా పెరుగుతుండడంతో పాఠశాలలు మూసీ వేసే పరిస్ధితి ఉందని సమాచారం. కరోనాతో కష్టాలు వచ్చాయని, బతకడమే కష్టంగా మారిందని వలంటీర్లు వాపోతున్నారు.