ఎంకామ్ చదివిన ఓ అమ్మాయి లారీ డ్రైవింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కేరళలోని త్రిసూర్ కు చెందిన 24 ఏళ్ల దెలిషా 300 కిలోమీటర్ల పాటు అలుపు సొలుపు లేకుండా డ్రైవింగ్ చేస్తూ లారీ డ్రైవింగ్ మగాళ్లే కాదు, తానూ చేయగలనని నిరూపిస్తోంది. ఆమె తండ్రి పీఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో, దెలిషా ఆ దిశగా ఆసక్తి పెంచుకుంది. డేవిస్ కూడా ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించారు. దెలిషా వారానికి మూడు పర్యాయాలు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు తీసుకెళ్లి మళ్లీ తిరిగొస్తుంది. ఇరుంబనం వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నుంచి చమురును తిరూర్ లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరు ద్వారా తరలించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పనిగా మారింది.
గత మూడేళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ట్యాంకరు లారీని పరుగులు పెట్టిస్తోంది. ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, దెలిషా లారీని కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు విస్మయానికి గురయ్యారు. సార్, ఓ చిన్న అమ్మాయి ట్యాంకరు లారీ నడుపుతోంది అంటూ తమ పై అధికారులకు సమాచారం అందించారు. ఆపై, దెలిషా డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్), ప్రమాదకర వస్తువులు రవాణా చేసే లైసెన్స్, ఇతర అనుమతి పత్రాలు చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మాయి అయినప్పటికీ నిబ్బరంగా లారీ నడుపుతున్న తీరు చూసి అధికారులు సైతం ఆమెను అభినందించారు.
తొలుత టూ వీలర్ నడపడం నేర్చుకున్న దెలిషా, ఆపై ఫోర్ వీలర్ డ్రైవింగ్ ను కూడా నేర్చేసుకుంది. ఈ క్రమంలో తన తండ్రి నడిపే పెట్రోల్ ట్యాంకరు డ్రైవింగ్ ను కూడా కొద్దికాలంలోనే వంటబట్టించుకుంది. 16 ఏళ్ల వయసులోనే దెలిషా లారీ నడిపిందంటే ఆమె నైపుణ్యం, తపన ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలన్నది దెలిషా కల. అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.