కరోనా వైరస్‌ను కంట్రోల్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు ఇక చివరి అస్త్రంగా లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అటు ఏపీలోనూ మొన్నటి వరకు నైట్ కర్ఫ్యూ ఉండగా.. కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. దీంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని, ఆ తర్వాత 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
ఏపీలో రేపటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే నిత్యావసరాలు, వ్యాపారాలకు కర్ఫ్యూ నుంచి సడలింపు ఇవ్వగా.. మధ్యాహ్నం 12 తర్వాత ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని, ఆర్టీసీ బస్సులను కూడా నడపకూడదని కేబినెట్ నిర్ణయించింది. మధ్యాహ్నం 12 తర్వాత అంతర్రాష్ట్ర, దూరప్రాంత బస్సులు కూడా నిలిచిపోనున్నాయి.
అటు కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్ డోసులు త్వరగా కేటాయించాలని ప్రధానిని కోరనున్నారు. 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.