ఊపిరి పోయాల్సిన ఆక్సిజన్ ప్రాణాలు తీసింది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు చనిపోయారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి జరిగిన విషాదం ఇదీ. రుయా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఎటు చూసినా బెడ్లపై అచేతనంగా పడి ఉన్న బాధితులు, శ్వాసకోసం ఇబ్బందులు పడుతున్న వారే కనిపించారు. వైద్యులు, సిబ్బంది వారి చుట్టూ చేరి.. ఛాతీపై నొక్కుతూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నించారు. ఆక్సిజన్ ట్యాంకు ఖాళీ కావడంతో 5 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ ట్యాంకర్ రాకతో సరఫరాను సాంకేతిక బృందం పునరుద్ధరించింది. అయినా అప్పటికే పలువురు బాధితులు మృతి చెందారు.
వెంటిలేటర్ పై ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న వారికీ… ఊపిరి అందించేందుకు బాధిత బంధువులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కన్నీరు పెట్టేలా చేశాయి. దాదాపు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా ఆగిందని, నామమాత్రంగా కొందరికి మాత్రమే ఆక్సిజన్ ను సరఫరా చేసారని కరోనా బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. రుయాలో అక్సిజన్ సరాపరాలో అంతరాయంతో11మంది మరణించినట్లు అధికారుల వెల్లడించారు. మరో 40 మందికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారికి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
రాయలసీమలోనే అత్యంత వసతి కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి రుయా. ఇందులో అనేక విభాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్ ప్లాంట్ల్స్ ఉంటాయి. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వారికీ రుయా ఆసుపత్రి పెద్ద దిక్కుగా మారింది. మొత్తం వెయ్యి మంది రోగులకు చికిత్స అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో 700 వరకూ ఆక్సిజన్ పడకలే ఉన్నాయి. నిత్యం 30 మంది డ్యూటీ డాక్టర్లు…రోగులను పరిశీలిస్తూ ఉంటారు. ఇంత కీలకమైన చోట…ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం కలకలం రేపింది. రోగులు ప్రాణవాయువు అందక విలవిల్లాడుతున్న దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు వందల సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నిమిషాల వ్యవధికి ముందు మాట్లాడిన తమ వారు ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు లేరని రోధించారు.
ఇటీవల వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని…స్విమ్స్, రుయా ఆస్పత్రులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రోగులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని…ఈ సమావేశాల్లో వైద్యులు కోరారు. అయినా సరే 10 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ మొత్తం ఖాళీ అయ్యే వరకూ ఆసుపత్రి సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాడులోని శ్రీపెరంబూరు నుంచి ఉదయం రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్…సాయంత్రం వరకూ రాకపోయినా పర్యవేక్షించాల్సిన వ్యవస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చేలోపు సిలిండర్ల ద్వారా ఊపిరి అందించేందుకు అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 5 నిమిషాలే జాప్యం జరిగిందని చెబుతుండగా…దాని ఖరీదు 11 ప్రాణాలుగా మారింది. 3 ట్యాంకులతో ఆక్సిజన్ సరఫరా నిర్వహిస్తున్న ఆస్పత్రిలో అత్యవసర సమయాల్లో వేరే ట్యాంకుల నుంచి ఆక్సిజన్ తీసుకొనే అవకాశం లేకపోవడమూ ప్రమాదానికి మరో కారణంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: 12-15 ఏళ్ల వారికీ టీకా రెఢీ….