Friday, November 22, 2024

యూపీలో మరో దారుణం.. కత్తి పట్టిన కన్నప్రేమ

యూపీలో దారుణ ఘటనలు ఆగడం లేదు. ఓ తండ్రి తన కన్నకూతురినే అత్యంత క్రూరంగా చంపేశాడు. కూతురి తల నరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. హర్దోయి జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పండేతారా గ్రామంలో సర్వేష్ కుమార్ అనే వ్యక్తికి 17 ఏళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా ఆమె ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తండ్రికి తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయిన సర్వేష్ ఓ పదునైన ఆయుధంతో కూతురిని నరికి చంపాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బాటసారులు విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రశ్నించగా.. ‘నేనే చేశాను. ఇందులో వేరే ఎవరికీ ప్రమేయం లేదు. తలుపులు గడియపెట్టి తనను నరికాను. ఆ తర్వాత మొండాన్ని అక్కడే పడేసి తల స్టేషనుకు తీసుకువస్తున్నా’ అంటూ ఏ మాత్రం బెదురు లేకుండా సమాధానమిచ్చాడు. ఆ సమయంలో అతడిలో పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. సర్వేష్‌ను వారు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement