కరోనా కట్టడి కోసం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలతో పాటు వైద్యులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది మాస్కును ముక్కుకు కాకుండా మూతి వరకు మాత్రమే వేసుకుంటున్నారు. మాస్కును సక్రమంగా వేసుకుంటే వ్యాక్సిన్ మీ దాకా వచ్చేవరకూ అదే రక్షణ కలిపిస్తుందని అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. అంతేకాదు..ఇటీవల మాస్క్‌ల ధారణ, కొనుగోలుపై మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది.
✪ మనం ధరించే మాస్క్ కనీసం మూడు పొరలు కలిగి ఉండాలి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. డిస్పోజబుల్ మాస్కులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
✪ నోస్ వైర్ తప్పనిసరిగా ఉండాలి. మాస్కును కాంతి వస్తున్న వైపు పెట్టినప్పుడు అది దాన్ని నిరోధించేలా ఉండాలి.
✪ మాస్క్ వేసుకునేటప్పుడు అది అన్ని వైపులా కవర్ అయ్యిందో లేదో చూడాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు దానికి తగ్గట్లు మాస్కు కూడా ముందుకు, వెనక్కు కదలాలి.
✪ ఎన్–95 లేదా కేఎన్–95 వాడేటప్పుడు దాని మీద మరో మాస్కును వాడవద్దు. వైద్య సిబ్బంది ఎక్కువగా వాడే వీటిని ఇప్పుడు సామాన్య ప్రజలు వినియోగిస్తున్నారు. ఇవి మరింత సురక్షితమైనవి అని పేరు ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, కేఎన్–95 మాస్కులు ఎక్కువగా చైనాలో తయారవుతాయి. వీటిల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులు అమెరికాలో ఉన్నాయి. కాబట్టి వాటిని కొనేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా.. వీటిని వాడవద్దు.
✪ గడ్డం ఉన్నవారి విషయంలో మాస్క్ ఫిటింగ్ సమస్యగా మారింది. వీరికంటూ ప్రత్యేకమైన మాస్కులు లేని నేపథ్యంలో.. ఈ కరోనా కాలంలో అయితే షేవింగ్ చేసుకోవడం లేదా.. గడ్డం ట్రిమ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని సీడీసీ తెలిపింది. వీరు డబుల్ మాస్క్ ధరిస్తే.. మరింత సురక్షితమని పేర్కొంది. వీటితో పాటు సోషల్ డిస్టెన్స్ కూడా ముఖ్యమని మరోమారు స్పష్టం చేసింది.