ప్రస్తుతం దేశం ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయగా.. వాటిల్లో ఎక్కువ శాతం రిలయన్స్ గ్రూప్‌కే వెళ్లాయి. ఇప్పుడు ఏపీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించడంతో ఇక విశాఖ పోర్టును కూడా అలాగే చేస్తారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో ఏపీలోని తీర ప్రాంత పోర్టులను అదానీ కొనుగోలు చేస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది.
అదానీ గ్రూప్ ఇప్పటికే పోర్టుల విషయంలో మంచి పట్టు సాధించింది. చివరికి ఏపీలోని అతి పెద్ద ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం కూడా అదానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా గంగవరం పోర్టును కూడా అదానీ గ్రూప్ కొంటుందని తెలుస్తోంది. అటు భావనపాడు పోర్టును కూడా అదానీకే ఇవ్వాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అటు ఇంకా దేశంలోని మరికొన్ని పోర్టులపైనా అదానీ గ్రూప్ గురిపెట్టినట్లు మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.