Friday, November 22, 2024

దేశంలో మళ్లీ కరోనా పంజా..

దేశంలో కొన్ని వారాలుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ కంగారు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,51, 935 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 18,327 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 108 మంది కరోనా మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు 1.11 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడగా మొత్తం 1,57,656 మంది చనిపోయారు. నిన్న 14,234 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు మొత్తంగా 1,08,54,128 మంది కరోనాను జయించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా టీకాలు తీసుకున్న వారి సంఖ్య 2 కోట్లకు చేరువ అవుతోంది. రెండు దశల్లో మార్చి 5 నాటికి 1,94,97,704 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 14,92,201 మంది టీకాలు వేయించుకున్నారు.

అటు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 40, 712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు 2,99,742 కరోనా కేసులు నమోదు కాగా మృతి చెందిన వారి సంఖ్య 1,640కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 196 మంది కోలుకోగా ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 2,96,166కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement