Saturday, November 23, 2024

దళిత బంధు పథకానికి దళిత రక్షణ నిధి!

దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థికసాయానికి అదనంగా దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ దళిత బంధు కేవల ఓ కార్యక్రమం కాదని, ఇది ఒక ఉద్యమం అని అన్నారు. ఎవరైతే అవకాశం లేక, సహకారం అందక బాధపడుతున్నారో అటువంటి వర్గాలన్నింటికి దళిత బంధు బాటలు పరుస్తుందని చెప్పారు.

నాడు ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయాన్ని అందించిందని గుర్తు చేశారు. అంబేద్కర్ కృషి వల్ల దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందని చెప్పారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి వారి ఇష్టాన్ని బట్టి దళిత బంధు పథకంద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అక్కడిక్కడే అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పథకం విధివిధానాలు, అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఎస్సీల భూముల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు. హుజూరాబాద్‌లో ఇల్లులేని ఎస్సీ కుటుంబం ఉండకూడదని, ఇల్లులేని వారి వివరాలను గుర్తించాలని చెప్పారు. ఖాళీ స్థలముంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో రేషన్‌ కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రతి ఎస్సీవాడలో అధికారులు పర్యటించాలని,  వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందన్నారు. దళితబంధు పథకాన్ని కూడా ఇతర రాష్ట్రాలు అనుసరించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కొత్త రాజకీయ చదరంగం!

Advertisement

తాజా వార్తలు

Advertisement