Saturday, November 23, 2024

తొలిసారిగా ఏపీలో హిజ్రాలకు గుర్తింపు కార్డులు

ఏపీలో ఒక్క అనంతపురం జిల్లాలోనే తొలిసారిగా హిజ్రా( ట్రాన్స్ జెండర్స్)లకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్లో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హిజ్రాలకు గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముందుగా మన జిల్లాలోని హిజ్రాలకు గుర్తింపు కార్డులు అందిస్తున్నామన్నారు. హిజ్రాల పట్ల సమాజంలో సరైన అవగాహన లేదని, పరిపాలనలో, సమాజంలో కూడా వారి పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హిజ్రాలకు ఇంటి స్థలాలు ఇవ్వడం, వారికి ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేపడతామన్నారు. వారి చదువుకు తగ్గట్లు ఉద్యోగం, వారికి రేషన్ ఇచ్చే కార్యక్రమం, స్కిల్ డెవలప్మెంట్, బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. హిజ్రాలకు ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు అందజేస్తామన్నారు.

హిజ్రాలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇంకా ఎవరైనా హిజ్రాలు ఉంటే గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారికి గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. ప్రస్తుతం అర్హులైన 61 మంది హిజ్రాలకు గుర్తింపు కార్డులు అందిస్తున్నామని, పరిశీలన జరిపి దరఖాస్తులు అందిన వాటిలో అర్హులైన వారికి గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ఇది ఎంతో సుధినం అని, హిజ్రాలకు సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా బతికేందుకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామన్నారు. హిజ్రాల పట్ల ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార సంస్థలలో ఎటువంటి వివక్ష చూపరాదని, వారు కూడా అందరితో సమానమేనని, వివక్ష చూపితే చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతోందన్నారు. జిల్లాలో 112 మంది హిజ్రాలు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తొందరగా హిజ్రాలకు చేరాలనే ఉద్దేశంతో అర్హులైన వారికి గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారన్నారు. అర్హులైన ప్రతి ఒక్క హిజ్రాలకు గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేయడం పట్ల పలువురు హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు. వారికున్న సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిజేబుల్ వెల్ఫేర్ ఏడి రసూల్, డ్వామా వేణుగోపాల్ రెడ్డి, హిజ్రాలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement