టీడీపీ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే జగన్ మాత్రం విధ్వంసానికి పెద్దపీట వేశారని కర్నూలు పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన కర్నూలు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మండపం వద్ద రోడ్డు షోకి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో జగన్ ABCD పాలన తెచ్చారని అన్నారు. A అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, B అంటే బాదుడు, C అంటే అవినీతి, D అంటే విధ్వంసం అని సెటైర్లు వేశారు. ‘ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా? ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’ అని ప్రశ్నించారు. వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు బాబాయిని ఎవరో చంపారని ఆరోపించి ఇప్పుడు CBI విచారణ వద్దంటున్నారని విమర్శించారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.