Friday, November 22, 2024

జగన్ ట్వీట్‌ పై చర్చ.. కొంచెం ఎదగండి!

కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరం అండగా ఉందామంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు కౌంటర్ గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కరోనా నియంత్రణపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి… కరోనా కట్టడి చర్యలపై చర్చించారు. అనంతరం హేమంత్ సోరెన్ నిన్న ట్వీట్ చేస్తూ ప్రధాని తన మాటలు వినలేదని, ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారని పేర్కొన్నారు. ‘’ఆయన తన ‘మన్‌ కీ బాత్‌’ మాత్రమే చెప్పారు. కాస్త ఉపయోగపడే విషయాలు చెప్పి, మేం చెప్పేదీ విని ఉంటే బాగుండేది’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఝార్ఖండ్ సీఎం ట్వీట్‌ పై బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఖండించారు. హేమంత్‌ ట్వీట్‌ సరికాదని ట్విట్టర్‌ లోనే తమ వైఖరి చెప్పారు. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ సైతం హేమంత్‌ వైఖరిని తప్పుపడుతూ ట్వీట్‌ చేశారు. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఇలాంటి రాజకీయాలు తగవని, ఒకరినొకరం వేలెత్తి చూపించుకోవద్దని, అందుకు ఇది సమయం కాదని అన్నారు. మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో ప్రధానికి అండగా నిలబడదామని హితవు పలికారు. కరోనా సమయంలో ప్రధానిని నిందించే బదులు… పార్టీలకు అతీతంగా కోవిడ్‌ పై పోరాటాన్ని బలోపేతం చేద్దా అంటూ సలహా ఇచ్చారు. దీంతో జగన్ ట్వీట్ కూడా వైరల్ మారింది.

జగన్ ట్వీట్‌ పై స్పందించిన ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా రీట్వీట్ చేస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో లాలూచీ పడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి లాంటి పెద్ద నేతకు కుమారుడివై ఉండీ ఇలా సీబీఐ, ఈడీ దాడులకు భయపడి ప్రధానికి దాసోహం కావడమేంటని ప్రశ్నించారు. ‘ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీరు మరింత ఎదగాలి’ అంటూ విమర్శలు కురిపించారు.

ఇటు ఏపీలో విపక్షలు.. టీడీపీ, కాంగ్రెస్ అభిమానులు మాత్రం జగన్ ట్వీట్ పై విమర్శలు చేస్తున్నారు. తన కేసులకు భయపడి ప్రధానిని జగన్ నిందించలేకపోతున్నారని.. ఇతర సీఎంలు వాస్తవాలను ధైర్యంగా మాట్లాడితే.. వారిని కూడా ప్రశ్నించనీయడం లేదంటూ మండిపడుతున్నారు. త్వరలోనే బెయిల్ రద్దు అవుతుందనే భయంతోనే ఆయన ఇలా మోదీకి మద్దతు పలుకుతున్నారని.. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

పలువురు నెటిజన్లు కూడా జగన్‌ వైఖరిని తప్పుపట్టారు. ‘‘సారీ జగన్‌ సర్‌! కనీసం జార్ఖండ్‌ సీఎం… ప్రధానికి తన వైఫల్యాలను ఎత్తి చూపి తనకు వెన్నెముక ఉందని నిరూపించుకున్నారు. ప్రతిసారీ మనం మోదీగారి భజన చేయలేం’’ అని శివకుమార్‌ అనేవ్యక్తి స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement