కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఏడాది పాటు రక్షణ ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత బూస్టర్ డోసు ఇవ్వచ్చన్నారు. ఈ విషయాలతో కూడిన రిపోర్టును ఐసీఎంఆర్ కు పంపామని వెల్లడించారు. వైరస్ బారినపడిన నెల రోజుల తర్వాత ఒక డోసు పొందడం ద్వారా వీరిలో గణనీయంగా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. ఏకంగా మూడింతలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. అదే వైరస్ బారినపడని వ్యక్తుల్లో ఒక డోసు పొందిన తర్వాత యాంటీబాడీల వృద్ధి సాధారణంగా ఉంది.
ఈ అంశంపై హైదరాబాద్‌లోని ‘ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’ వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ఇతర డాక్టర్లు సంయుక్తంగా పరిశోధన నిర్వహించారు. పరిశోధనలో భాగంగా కరోనా బారిన పడిన వారికి టీకాలు ఇచ్చారు. ఒక డోసు టీకా ఇచ్చిన వారిలో 4 వారాల తర్వాత యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయో పరిశీలించారు. కొవిడ్ బారినపడి కోలుకున్న వారిలో అవి గణనీయంగా వృద్ధి చెందాయి. అదే ఒక డోసు తీసుకున్న సాధారణ వ్యక్తుల్లో అంతగా వృద్ధి చెందలేదు. ముఖ్యంగా సాధారణ వ్యక్తుల్లో కంటే కొవిడ్ బారినపడి కోలుకున్న వారిలో ఒక డోసు టీకాకే మూడింతలు అధికంగా వచ్చాయి. కొవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందాయా? లేదా అనేది తెలుసుకోవడానికి ‘న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఎస్1 ఎస్2’ అనే పరీక్ష చేస్తారు. ఫలితాల్లో యాంటీబాడీల వాల్యూ 150 దాటితే రక్షణగా ఉంటుందని అర్థం. కొవిడ్ సోకకుండా ఒక డోసు టీకా పొందిన వారిలో వాల్యూ సుమారు 150 వరకూ పెరిగింది. అదే వైరస్ సోకి తగ్గాక వ్యాక్సిన్ తీసుకుంటే 450 కంటే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
”సాధారణంగా ఒక డోసు టీకా తీసుకుంటే ఒకట్రెండు నెలల్లో యాంటీబాడీలు తగ్గిపోతాయి. కానీ కరోనా నుంచి కోలుకున్న వారిలో ఒక డోసు తీసుకుంటే ఎక్కువ కాలం యాంటీబాడీలు కొనసాగుతున్నాయి. వీరిలో ‘టి సెల్’ జ్ఞాపకశక్తి దాదాపు 12 నెలల పాటు రక్షణ కల్పిస్తుందని అంచనా. ‘టి కణాల’ జ్ఞాపకశక్తి అనేది ఎముక మజ్జ (బోన్ మ్యారో)లో ఉండిపోతుంది. మరోసారి ఎప్పుడైతే వైరస్ దాడి చేస్తుందో.. అప్పుడు ఈ ‘టి సెల్స్’ రక్షణగా ముందుకొస్తాయి. వైరస్‌కు వ్యతిరేకంగా అవసరమైన మేరకు పెద్ద సంఖ్యలో యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి” అని నిపుణులు వెల్లడించారు.
”కొవిడ్ సోకిన ఎవరైనా నెల రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చు. ఇటువంటి వారికి ఒక్క డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయి. రెండోది అవసరం లేదు. ఇలా మిగిలిన వాటిని ఇతరులకు ఉపయోగించొచ్చు. ప్రభుత్వానికి టీకాలపై ఖర్చు కూడా తగ్గుతుంది. ఇటువంటి వారికి ఏడాది పాటు రక్షణ ఉంటుందనే అంచనాల నేపథ్యంలో.. బూస్టర్ డోసును ఏడాది తర్వాత ఇవ్వొచ్చు. ఈ అధ్యయన అంశాలను భారతీయ వైద్య పరిశోధన మండలికి (ఐసీఎంఆర్‌కు) కూడా పంపించాం. కొవిడ్ వచ్చిన వారికి ఒక డోసు టీకా సరిపోతుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి మా పరిశోధన ఉపయోగపడుతుంది” అని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు.