Friday, November 22, 2024

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

కరోనా వైరస్ మహమ్మారి మరో ప్రజాప్రతినిధిని పొట్టన పెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో మంగళవారం మృతి చెందారు. నంద్ కుమార్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెప్టెంబర్ 8న 1952లో బుర్హాన్‌పూర్‌లో జన్మించిన ఆయన తొలుత మున్సిపల్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఖాండ్వా లోక్‌సభ నుంచి ఐదుసార్లు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగానూ ఆయన రెండు సార్లు పనిచేశారు.

జనవరి 11న నంద్ కుమార్ సింగ్‌కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ కార్యకలాపాలు, సంస్థాగత నైపుణ్యాలతో మధ్యప్రదేశ్‌‌లో బీజేపీని బలోపేతం చేయడానికి నంద్ కుమార్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement