Friday, November 22, 2024

కరోనాకు మరో ఉద్యోగి బలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాకు ఉద్యోగులు వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనాతో సచివాలయంలో నలుగురు ఉద్యోగులు మృతి చెందగా.. తాజాగా మరో ఉద్యోగి కరోనాతో ప్రాణాలు వదిలారు.  కార్మికశాఖలో సెక్షన్ అధికారి (ఎస్ఓ) నిన్న రాత్రి మరణించారు. కొద్దీ రోజుల క్రితమే కరోనా బారిన పడిన ఆయన విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. కొందరు చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. తమకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇవ్వాలని గత కొద్ది రోజులుగా ఉద్యోగులు కోరుతున్న సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరిగింది. నిన్న 10,759 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు కోవిడ్‌ తో 29 మంది మృతి చెందారు.

గత వారం రోజుల్లో ఐదుగురు సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తాజాగా లేబర్ విభాగం ఎస్ఓ అజయ్ బాబు కరోనా సోకి మృతి చెందారని తెలిపారు. సీఎం జగన్ తాడెపల్లి ప్యాలెస్ నుంచి బయటకి రాకుండా ఉద్యోగులను మాత్రం విధులకు రావాలనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉద్యోగులు రోజుకొకరు పిట్టల మాదిరి రాలి పోతుంటే సీఎం జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. మృతి చెందిన ఉద్యోగులకు కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సీఎం కళ్లు తెరిచి సెక్రటేరియట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంకు అవకాశం కల్పించాలని అశోక్‌బాబు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement