Friday, November 22, 2024

ఆ రెండు కార్పొరేషన్లలకు మేయర్లు వీరే..

తెలంగాణలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లోనూ మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు రెండూ అతివలకే లభించాయి. వరంగల్‌ మేయర్‌ గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ గా రిజ్వానాను ఎన్నికయ్యారు. వరంగల్ 29వ డివిజన్ కార్పొరేటర్ గా గుండు సుధారాణి, వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్ గా రిజ్వానా గెలిచారు.

ఇక ఖమ్మం కార్పొరేషన్ లోనూ మహిళలకు పెద్ద పీట వేశారు. ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రాలను ఎన్నుకున్నారు. వీరిద్దరినీ పార్టీ హైకమాండ్ కీలక పదవులకు ఎంపిక చేయగా, వారి పేర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో నీరజ 26వ డివిజన్ నుంచి, ఫాతిమా 37వ డివిజన్ నుంచి విజయం సాధించారు. ఇక సిద్దిపేట మున్సిపాలిటీకి కడదర్ల మంజుల, జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్‌లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహగౌడ్‌ ల పేర్లను సీఎం ఖారారు చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నేతలతో చర్చించి సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లి, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..కొన్ని సమీకరణాలు దృష్ట్యా పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని కాదని విప్ ధిక్కరిస్తే క్రమ శిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్ధిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ పార్టీ మేజర్ వార్డులు గెలుచుకుంది. దీంతో ఇక్కడ ఇక మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ లు , వైస్ చైర్మన్లు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులే ఎన్నికైయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి మెజార్టీ సాధించినందున ఇతర పార్టీలు, కో ఆప్షన్ సభ్యుల మద్దతు లేకుండానే టీఆర్ఎస్ ఖాతాలో ఈ పదవులు చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement