Friday, September 20, 2024

అవసరమైతే విశాఖ వెళ్లి ప్రత్యక్షంగా పోరాడతాం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అవసరమైతే విశాఖకు వెళ్లి ప్రత్యక్షంగా పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇలాగే అనుమతిస్తే రేపు బీహెచ్ఈఎల్, సింగరేణిని కూడా అమ్మే పరిస్థితిని తీసుకొస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెట్టుబడులు రావని చాలా మంది అన్నారని.. కానీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కరెంట్, నీరు, విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించామని తెలిపారు. ఆరేళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీపై తన మాటలు అసత్యమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఉత్తమ్ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరల పెంపుపై బీజేపీ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. దేశం కోసం, ధర్మం కోసం ధరలు పెంచామని బీజేపీ నేతలు అంటున్నారని.. ఏ దేశం కోసం ధరలు పెంచారో చెప్పాలన్నారు. ఈనెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల రోజును ప్రజలు హాలీడేగా భావించొద్దని.. ఓటు డేగా భావించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement