Top Story మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలో భూగర్భ విద్యుత్‌ వెలుగులు

– అండర్‌ కేబుల్‌ కరెంట్‌ వ్యవస్థ
– రూ.785 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన సీపీడీసీఎల్‌
– జిల్లాలోనే ప్రథమం
– 2012 కిలోమీటర్ల ఎల్‌టీ లైన్, 227 కి.మీ 11కేవీ లైన్, 159 కి.మీ 33 కేవీ లైన్‌ ఏర్పాటు
– కొత్తగా 6,836 సర్వీస్‌ ఫిల్లర్స్, 362 ట్రాన్స్‌ఫార్మర్లు
– మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం రూ.30 కోట్లతో ఐదు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు నిర్మాణం
– విద్యుత్‌ స్తంభాలు లేని సరికొత్త వ్యవస్థ

గుంటూరు ప్రతినిధి,ఆంధ్రప్రభ:

అస్తవస్త్య విద్యుత్‌ లైన్లు..కాకి గూడును తలపించేలా గృహాలకు విద్యుత్‌ను తీసుకెళ్లే సర్వీస్‌ వైర్లు..చినుకు పడినా…చిన్నపాటి గాలులు వీచినా…ఊయలను తలపించేలా ఊగిపోయే లైన్లు…. దీంతో ఫట్‌ మని కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు. గంటల తరబడి విద్యుత్‌ అంతరాయాలు….పునరుద్ధరణకు శ్రమించే సిబ్బంది….మురుగు కాలువల మధ్యలో స్తంభాలు…ఇది ఇప్పటి వరకు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దుస్థితి. ఒకవైపు విద్యుత్‌ సరఫరా సంస్థలను, మరోవైపు వినియోగదారులను ఇక్కట్లకు గురిచేస్తున్న పాతకాలం నాటి వ్యవస్థకు ఆధునిక హంగులను అద్దుతున్నారు. సరికొత్తగా భూగర్భ విద్యుత్‌ వెలుగులకు రంగం సిద్ధం చేస్తున్నారు. దానికి మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక చొరవ తీసుకుని గుంటూరు జిల్లాలోనే ప్రప్రథమంగా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థలో భూగర్భ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దానికోసం ఇప్పటికే మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(సీపీడీసీఎల్‌) ప్రాథమికంగా రూ.785 కోట్లతో అంచనాలను రూపొందించారు.

జిల్లాలోనే ప్రప్రథమంగా…..మంగళగిరిలో
భూ ఉపరితలంలో విద్యుత్‌ స్తంభాల ద్వారా విద్యుత్‌ను సరఫరాను చేసే వ్యవస్థ మాత్రమే ప్రస్తుతం జిల్లాలో ఉంది. అయితే భూగర్భంలో విద్యుత్‌ తీగల ద్వారా విద్యుత్‌ను అందించే వ్యవస్థను మాత్రం ప్రప్రథమంగా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరి«ధిలో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఇప్పటికే రూ.983 కోట్ల అంచనాలతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంటింటీకి గ్యాస్‌ సరఫరాలను సైతం భూగర్భం నుంచే అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వీటితో పాటు మెరుగైన విద్యు™Œ సరఫరా కోసం విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను సైతం భూగర్భంలో నుంచే తీసుకువచ్చేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. మంగళగిరి–తాడేపల్లి ముఖ్య పట్టణాలలో ముందస్తుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అంటే మంగళగిరి, తాడేపల్లి, డొలస్‌నగర్, ఆత్మకూరు, కాజా, చిన్నకాకాని ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తారు. కార్పొరేషన్‌ పరిధిలోనే ఉన్న నూతక్కి, పెద్దవడ్లపూడి, రామచంద్రాపురం వంటి ప్రాంతాలను రెండో విడతలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ సరఫరాను అందిస్తారు. ఆమేరకు ఇప్పటికే సీపీడీసీఎల్‌ అధికారులు రూ.785 కోట్లతో అంచనాలు రూపొందించారు. భూగర్భ విద్యుత్‌ వ్యవస్థ వలన గాలి ధుమారం, వరద, వృక్షాలు మొదలైన వాటి ద్వారా విద్యుత్‌ సరఫరాకు వచ్చే నష్టాలను నివారించవచ్చు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి విద్యుత్‌ తీగలు లేకుండా నగరాలు మరింత అందంగా ఉంటాయి.

6,836 సర్వీస్‌ ఫిల్లర్స్‌…2012 కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు

ఎంటీఎంసీ పరిధిలో భూగర్భ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వందల కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లు అవసరమని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 68,577 విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. వీటన్నిటినీ భూగర్భ వ్యవస్థగా అనుసంధానం చేయనున్నారు. అందుకోసం 33 కేవీ లైన్‌ 159 కిలోమీటర్లు, 11 కేవీ లైన్‌ 227 కిలోమీటర్లు, ఎల్‌టీ లైన్‌ 2012 కిలోమీటర్లు కొత్తగా వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 313 కేవీఏ, 500 కేవీఏ సామర్థ్యం కలిగిన 362 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. నూతన వ్యవస్థకు విద్యుత్‌ సర్వీసులను అనుసంధానం చేసేందుకు 402 ప్రాంతాల్లో రింగ్‌ మెయిన్‌ యూనిట్ల(ఆర్‌ఎంయూ)ను సిద్ధం చేయనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమి లోపలే ప్రతిష్టమైన రక్షణతో ఈ భూగర్భ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీపీడీసీఎల్‌ ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రప్రభ’తో తెలిపారు.

ఐదు ప్రాంతాల్లో నూతన సబ్‌స్టేషన్లు….
మెరుగైన విద్యుత్ పంపిణీ కోసం ఎంటీఎంసీ పరిధిలో నూతనంగా ఐదు ప్రాంతాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో ఐదు ప్రాంతాల్లో రూ.30 కోట్లతో ఐదు 33కేవీ/11 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మిస్తారు. విద్యుత్, కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో అందుకోసం ఇప్పటికే మంగళగిరి పట్టణంలో కీలకమైన గౌతమ్‌బుద్ధ రోడ్డు, రత్నలచెరువు, కాజా, కొలనుకొండ, కృష్ణాయపాలెంలో స్థలలను గుర్తించారు. జిల్లాలోనే ప్రప్రథమంగా చేపడుతున్న పూర్తిస్థాయి భూగర్భ విద్యుత్‌ వ్యవస్థను విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు మంత్రి నారా లోకేష్, విద్యుత్‌ శాఖాధికారులు, ఎంటీఎంసీ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే భూగర్భ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన విశాఖపట్నం, తిరుపతి నగరాలను అధికారులు పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *