Top Story | కొత్త ఠాణాలపై ని”వేదన‌”లే.. పనుల్లేవ్​!

పెద్దపల్లి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను మరింత సత్వరంగా పరిష్కరించేందుకు 100 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆచరణలో దాట‌వేత ధోర‌ణి అవ‌లంబిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి ప్రభుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు అందజేశారు. కొత్త పోలీస్ స్టేషన్ల‌తో పాటు ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఫిబ్రవరిలో నివేదికలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా.. అందుకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయ‌లేదు. దీంతో జిల్లా కేంద్రాల్లో పోలీసులు ఇబ్బంది పడుతున్నారని రేవంత్ స‌ర్కారు గుర్తించింది. దీనికి అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం నివేదికలు కావాల‌ని కోర‌డంతో అధికారులు ఈ మేర‌కు రిపోర్టుల‌ను పంపారు.

ప‌ని ఒత్తిడికి గుర‌వుతున్న‌ పోలీసులు..

కలెక్టరేట్ల వద్ద బందోబస్తు నిర్వహణతో పాటు ఇతర కార్యక్రమాలతో పని ఒత్తిడి బాగా పెరిగింద‌ని అధికారులు సమాచారం ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అవసరమున్న ప్రతి చోట కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతోపాటు ట్రాఫిక్ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. దీంతో పాటు జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణ‌యించారు. సీఎం ఆదేశాల‌తో పోలీసు ఉన్నతాధికారులు జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాలి, ఎంత సిబ్బంది ఉండాలనే విష‌యంలో గతంలో ఏ సర్కిల్ పరిధిలో, సబ్ డివిజన్ పరిధిలో ఉంది అనే అంశాలను నివేదిక రూపంలో తయారుచేసి ప్ర‌భుత్వానికి నివేదిక‌లు అందించారు.

ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు..

నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతోపాటు ఇప్ప‌టికే ఉన్న 79 పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని అధికారులు త‌మ రిపోర్టుల్లో పేర్కొన్నారు. ప్రణాళికలు సిద్ధం అవడంతో ఉగాదికి కొత్త పోలీస్ స్టేషన్ల తో పాటు అప్ గ్రేడేషన్లు ఉంటాయని పోలీసు అధికారులు భావించారు. దీంతో 13 ఏళ్లుగా పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐల ప్రమోషన్లు పక్కా అనే స‌మాచారం ఉంది. అయితే.. అయిదు నెలలు గడిచిపోయినా ఆ ఫైల్ ముందుకు సాగ‌క‌.. ఆచరణకు నోచుకోవడం లేదు. ఇక‌.. 2014 బ్యాచ్ ఎస్ఐలకు సెల్యూట్ చేయాల్సి వస్తుందని 2012 బ్యాచ్ ఎస్సైలు లబోదిబోమంటున్నారు. పుండుపై కారం చల్లినట్లు సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు ఇవ్వడంతో ఇక తమకు పదోన్నతులు ఇప్పట్లో రావని ఆందోళన చెందుతున్నారు. అప్ గ్రేడేషన్లు చేయాల్సింది పోయి ఎస్ఐలు విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్లలో ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను నియమించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అప్‌గ్రెడేష‌న్ చేస్తే అంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌నే అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది.

రామగుండం కమిషనరేట్ పరిధిలో..

రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌ను ఈ కేటగిరీ నుంచి డీ కేటగిరీకి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌ను ఎఫ్ కేటగిరీ నుంచి ఈ కేటగిరీకి, సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఈ కేటగిరి నుంచి డి కేటగిరీకి, మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో డి కేటగిరీ నుంచి బి కేటగిరీకి అప్గ్రేడ్ చేయాలని జిల్లా పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. దీంతోపాటు కొత్తగా పెద్దపల్లి రూరల్, పెద్దపల్లి ట్రాఫిక్, పెద్దపల్లి మహిళా, గోదావరిఖని మహిళ, ఎలిగేడు, మంచిర్యాల రెండవ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు పంపారు. ముఖ్యమంత్రి పెద్దపల్లి పర్యటన సందర్భంగా కొత్త పోలీస్ స్టేషన్లకు హడావిడిగా జీవోలు జారీ చేశారు. నెలల విరామం అనంతరం ఎట్టకేలకు గత నెలలో మంత్రులు వాటిని ప్రారంభించారు. అయితే.. వాటికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో జిల్లాలో ఉన్న అధికారులు, సిబ్బందికి అటాచ్‌మెంట్‌ ఉత్తర్వలిచ్చి కొత్త పోలీస్ స్టేషన్ల‌ను నడుపుతున్నారు. అందువల్ల కొత్త పోస్టులు క్రియేట్ కాలేద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

నిజామాబాద్ కమిషనరేట్‌లో..

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ముశ్రా, సలూర, బోధన్ ట్రాఫిక్, ఆర్మూర్ ట్రాఫిక్, దొంకేశ్వర్, ఆలూర్, నందిపేట సర్కిల్ ఏర్పాటు కోసం నివేదికలు పంపించారు. నిజామాబాద్ వన్ టౌన్, నిజామాబాద్ టు టౌన్, నిజామాబాద్ త్రీ టౌన్, నిజామాబాద్ ఫోర్, నిజామాబాద్ ఫైవ్ టౌన్, నిజామాబాద్ సిక్స్ టౌన్, రూరల్, నవీపేట, మల్కూర్, డిచ్పల్లి, జక్రాన్ పల్లి, ఇందల్వాయి, ఆర్మూర్, నందిపేట, నిజామాబాద్ మహిళా, బోధన్ టౌన్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని పోలీసు అధికారులు నివేదికలు పంపించారు.

కరీంనగర్ కమిషనరేట్‌లో..

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ వన్ టౌన్, ఎల్ఎండీ, మానకొండూర్ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని, అందుకు తగిన సిబ్బందిని కేటాయించాలని సవివరంగా నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు.

సిద్దిపేట కమిషనరేట్‌లో..

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో గజ్వేల్ రూరల్, గజ్వేల్ ట్రాఫిక్, పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయాలని సిద్దిపేట వన్ టౌన్, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నివేదికలు పంపారు.

ఖమ్మం కమిషనరేట్‌లో..

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మధిర సబ్ డివిజన్, ఖమ్మం ట్రాఫిక్ 2, సబ్ లేడు, ఎం.వి పాలెం పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు ఖానాపురం, రఘునంద పాలెం, ముదిగొండ, కుసుమంచి, నేలకొండపల్లి, కామేపల్లి, వైరా, కొంజేర్ల, ఎంకూరు, విఎం బంజర్, వేంసూర్, కల్లూర్, తల్లెడ, మదిర టౌన్, మధిర రూరల్, బోనకల్, చింతకాని, ఖమ్మం టూ టౌన్, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, సత్తుపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.

ఆసిఫాబాద్ జిల్లాలో..

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ యు సర్కిల్, కాగజ్ నగర్ టౌన్ ట్రాఫిక్, ఆసిఫాబాద్ టౌన్ ట్రాఫిక్, ఆసిఫాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు వాంకిడి పోలీస్ స్టేషన్ అప్ గ్రేడ్ చేయాలని నివేదికలు సమర్పించారు.

భూపాలపల్లి జిల్లాలో..

భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో నూతనంగా ట్రాఫిక్ భూపాలపల్లి, భూపాలపల్లి మహిళ, ఘన్పూర్ సర్కిల్ కొత్త పలుగూరి పోలీస్ స్టేషన్ల ను ఏర్పాటు చేయడంతో పాటు కాలేశ్వరం, ఘన్పూర్, రేగొండ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.

ములుగు జిల్లాలో..

ములుగు జిల్లాలో ములుగురు ట్రాఫిక్, అలుబాక, మేడారం పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు ములుగు, వెంకటాపూర్, పసరా, ఎస్ ఎస్ తాడువాయి, మంగపేట, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు.

ఆదిలాబాద్ జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో బోత్ సబ్ డివిజన్ నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు మావుళ, ఉట్నూరు పోలీస్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని నివేదికలు పంపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

సిరిసిల్ల రాజన్న జిల్లాలో సిరిసిల్ల ట్రాఫిక్, వేములవాడ ట్రాఫిక్, సిరిసిల్ల మహిళా పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని ఇల్లంత కుంట, వేములవాడ, తంగళ్ళ పల్లి పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ కోసం నివేదికలు పంపించారు.

జగిత్యాల జిల్లాలో..

జగిత్యాల జిల్లాలో భీమారం, ఎండపల్లి పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు జగిత్యాల రూరల్, మల్యాల, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల టౌన్, రాయికల్, ధర్మపురి పోలీస్ స్టేషన్లను అప్గ్రేడ్ కోసం నివేదికలు పంపించారు.

మెదక్ జిల్లాలో..

మెదక్ జిల్లాలో మైసాయిపేట, మెదక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని తూప్రాన్ రూరల్, చేగుంట, మనోహరాబాద్, తూప్రాన్, నర్సాపూర్ పోలీస్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని నివేదికలు పంపించారు..

నిర్మల్ జిల్లాలో..

నిర్మల్ జిల్లాలో నూతనంగా నిర్మల్ ట్రాఫిక్, బైంసా ట్రాఫిక్, నిర్మల్ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు నిర్మల్ టౌన్, బైంసా టౌన్ పోలీస్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని నివేదికలు అందించారు.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి ట్రాఫిక్, కామారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు దేవన్పల్లి, కామారెడ్డి, బిచ్కుండ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.

భద్రాది కొత్తగూడెం జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట సబ్ డివిజన్, అన్నపురెడ్డిపల్లి సర్కిల్, పాల్వంచ ట్రాఫిక్, ఉమెన్ పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతోపాటు కొత్తగూడెం ట్రాఫిక్, దుమ్ముగూడెం, పాల్వంచ, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లను అప్డేట్ చేయాలని నివేదికలు అందించారు.

మహబూబాబాద్ జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా మహబూబాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, కేసముద్రం, గూడూరు, తొర్రూరు, మరిపెడ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నివేదికలు పంపించారు.

ఎస్ఐల స్థానంలో ఇన్స్పెక్టర్లు..

ప్రభుత్వం కొత్త పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం అటు నుంచి సబ్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లను కేటాయించడం గమనార్హం. కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల, ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఖమ్మం రూరల్, ముదిగొండ, మధిర, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐల స్థానంలో ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్కు ఇటీవల ఇన్స్పెక్టర్ ను నియమించారు. వరంగల్ కమిషనరేట్ లో ఏనుమాముల పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ కేటాయించారు.

పదోన్నతుల సమస్యకు పరిష్కారమేది..

గత ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోతో నష్టపోయిన 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐలు ఈ ప్రభుత్వ హయాంలోనైనా పదోన్నతులు దక్కుతాయని భావించారు. 2012 బ్యాచ్‌లో 146 మంది ఎస్ఐలుగా పోలీసుశాఖలో చేరగా ఇప్పటి వరకు 76 మంది మాత్రమే ఇన్‌స్పెక్ట‌ర్లుగా పదోన్నతి పొందారు. నాలుగేళ్ల క్రితం కొంతమందికి పదోన్నతులు రాగా.. గత నెలలో 10 మందికి పదోన్నతులు వచ్చాయి. మిగతావారు పదోన్నతుల కోసం 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తమ బ్యాచ్ కు చెందిన వారితో పాటు జూనియర్లు అయినా పదోన్నతులు పొందిన 2014 బ్యాచ్ వారికి సెల్యూట్ చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.

ముఖ్యమంత్రి దృష్టిపెడితేనే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమ పదోన్నతుల సమస్య పరిష్కరించాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ 2012 బ్యాచ్​కు చెందిన ఎస్​ఐలు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరుతున్నారు. కొత్త పోలీస్ స్టేషన్లు, కొన్ని పోలీస్ స్టేషన్ అప్​గ్రేడ్​ అవడంతో 2012 బ్యాచ్ ఎస్ఐల పదోన్నతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించారు. అయితే.. అధికారులు నివేదికలు అందజేసి అయిదు నెలలు గడుస్తున్నా ఆచరణకు నోచుకోక పోవడంతో పదోన్నతుల సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా.. ప్రభుత్వానికి స్పందించి కొత్త పోలీస్ స్టేషన్లు, అప్ గ్రేడేషన్లు చేసి తమకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.

Leave a Reply