- మణుగూరు మాజీ జడ్పీటీసీ కలవరపాటు
- బంధువుల ఇళ్లకు అక్రమాస్తుల ఆధారాలు
- గురుశిష్యుల అరాచకాలపై సర్వజనాగ్రహం
అభినవ కీచకులంటూ ఆరోపిస్తున్న బాధితులు - వెలుగు చూస్తున్న సార్ వారి రాసలీలలు
- అక్రమాల నుంచి అక్రమ సంబంధాల వరకు..
మాజీ జడ్పీటీసీ మెడకు బిగుస్తున్న ఉచ్చు - అక్రమాల వివరాలు సేకరించిన నిఘా వర్గాలు
- పార్టీ నాయకుడి మౌనం దేనికి సంకేతం.?
మాజీ ఎమ్మెల్యే మౌనంపై విమర్శల వెల్లువ
పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు కేంద్రంగా మాజీ జడ్పీటీసీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి… ఓ వైపు ఆంధ్రప్రభ వరుస కథనాలు.. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్న సమయంలో అక్రమంగా పోగేసిన ఆస్తిపత్రాలను తమ బంధువులు.. సన్నిహితుల ఇళ్లకు అక్రమార్కులు చేరుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది… అయితే విషయం తెలిసిన పలువురు ఆస్తి.. బ్యాంక్ పత్రాలను దాస్తే.. చేసిన అక్రమాలు వెలుగు చూడకుండా పోతాయా అని ప్రశ్నిస్తున్నారు… ఈ నేపథ్యంలోనే పార్టీని.. ప్రజాప్రతినిధుల అడ్డం పెట్టుకొని ఈ గురుశిష్యులు చేసిన ఆరాచకాలను వివరిస్తూ.. బాధితులు ముందుకు వస్తున్నారు… ఇంత జరుగుతున్నా.. పార్టీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెదవి విప్పక పోవడం దేనికి సంకేతమని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు…
ఆంధ్రప్రభ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గానికి చెందిన మణుగూరు మాజీ జడ్పీటీసీ అరాచకాలు, అక్రమాలు, అవినీతి పరంపరపై జిల్లా ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించిన ఐదేళ్లకాలంతో పాటు, పార్టీ నాయకుడిగా కొనసాగిన కాలంలోనూ ఆయన సాగించిన అక్రమాలపై పలు ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక అక్రమ లావాదేవీలు నిర్వహించడం, సెటిల్‌మెంట్లకు పాల్పడటంతో పాటు, కొందరు మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ పట్ల అభిమానం, సమాజంలో అవమానాల పాలవ్వాల్సి వస్తుందన్న ఆవేదనతో గుండెబాధను పెదవి దాటి బయట పెట్టని ఎందరో అభాగ్యులు ఆంధ్రప్రభ వరుస కథనాలతో ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి, తమకు జరిగిన అన్యాయాలపై గొల్లుమంటున్నారు. ఇదే సందర్భంలో అభినవ కీచకులుగా మారిన గురుశిష్యుల వ్యవహారంపై గ్రామాల్లోకి వస్తున్న పార్టీ బాధ్యులకు సైతం వివరించినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఆధారాలు మాయం చేసే కుటిల యత్నం.?
ఒకవైపు ఆంధ్రప్రభ స్మార్ట్, ఆంధ్రప్రభ దినపత్రికలో వరుస కథనాలు, అవినీతి అక్రమాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరా తీస్తున్న నేపథ్యంలో ఆత్మగౌరవ నినాదంతో అధికారం చేపట్టిన పార్టీలో గులాబీ ముళ్లుగా మారిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయ నాయకుడిగా, ఐదేళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా లభించిన పదవీ కాలన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలు సాగించిన సదరు మాజీ జడ్పీటీసీ, ఆ కాలంలో సంపాదించిన అక్రమ ఆస్తుల పత్రాలు, ఇతర ఆధారాలను దాచి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో తనకు సహకరించాల్సిందిగా కొందరు సన్నిహితులు, బంధువులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తామెక్కడ ఇరుక్కు పోతామోనన్న భయం కొందరిని వెంటాడుతుండగా, మరికొందరు తప్పని పరిస్థితుల్లో ఆయా ఆధారాలను దాచే యత్నానికి సహకరించినట్లు తెలిసింది. ఈ తతంగమంతా బయటకు పొక్కడంతో ఆధారాలు దాచినంత మాత్రాన చేసిన తప్పులు చెరిగిపోతాయా అని పలువురు విమర్శిస్తున్నారు. చట్టం ముందు ఎంతటి బలవంతులైనా తలవంచక తప్పదని, ఆలస్యం కావొచ్చేమో కానీ పాపం పండి తీరుతుందంటూ పేర్కొంటున్నారు.
అక్రమార్కుల మెడకు బిగుస్తున్న ఉచ్చు.?
అవినీతి అక్రమాలకు రారాజులుగా మణుగూరును నాకేసిన మాజీ జడ్పీటీసీ, ఆయన శిష్యుడి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారిరువురిపై వచ్చిన ఆరోపణలు, అక్రమాల చిట్టా కోసం నిఘా వర్గాలు ఆంధ్రప్రభను సంప్రదించడంతో పాటు, సమగ్ర వివరాలను సేకరించాయి. దీంతో ఏ క్షణ మైనా ఈ వివరాల ఆధారంగా చట్టబద్ధమైన చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ నాయకుల ముసుగులో సాగించిన అక్రమాలే కాక, వివాహేతర సంబంధాల వీడియోలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తెలిసిన వివరాల ప్రకారం భూమి ఇప్పిస్తానంటూ ఓ మహిళా నేతను మోసం చేయగా, సదరు ప్రబుద్ధుడు వేరే మహిళా నాయకురాలితో ఏకాంతంగా గడిపిన సందర్భాన్ని మోసపోయిన ఆ మహిళా బాధితురాలు మహిళ చిత్రీకరించినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా గుప్పుమనడంతో ఆ బాధిత మహిళా నాయకురాలు ఎవరు.?, ఆయనతో ఏకంతంగా ఉన్నది ఎవరన్న చర్చ జోరందుకుంది. ఈ మేరకు ఆ వీడియో ఫుటేజీని సంపాదించేందుకు అధికార విపక్షాలకు చెందిన పలువురు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అధికారమదంతో అక్రమాలకు తెగబడిన పార్టీపై అస్త్రంగా మలుచుకోవాలని ప్రస్తుత పాలక పార్టీ, సొంత పార్టీలోనే తమను ఇబ్బందుల పాలుజేసిన సదరు మాజీ జడ్పీటీసీని అడ్డు తొలగించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన విపక్షానికి చెందిన నేతలు ఆ మహిళ తీసిన వీడియో ఫుటేజీ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేయడం కొసమెరుపు.
పేదల గుండెల్లో గులాబీ ముళ్లు
- ముందే హెచ్చరించిన ఆంధ్రప్రభ
ఆంధ్రప్రభ ప్రజల పక్షాన సాగిస్తున్న అక్షర పోరాటంలో జనం గుండెల్లో పెట్టుకున్న పార్టీ నాయకులే గులాబీ ముళ్లుగా మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ, 2022 జనవరి 25న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. నాయకుల రూపంలో ఉన్న వీరి ఆగడాలను ప్రజలకు వివరించింది. అంతకు ముందు సైతం 2021 అక్టోబర్ 20న అక్రమాలకు అధిపతి శీర్షికన ప్రత్యేక కథనాన్ని సైతం ప్రచురించింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వారి తప్పులను వరుస కథనాలతో ఎత్తిచూపింది. నాడు అధికారంలో ఉన్న నాయకులు కానీ, పార్టీ పదవుల్లో కొనసాగుతున్న బాధ్యులు కానీ ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోక పోవడంతోనే, పినపాక, అంతకు పూర్వం బూర్గంపాడు నియోజకవర్గాల చరిత్రలోనే అత్యంత అవమానకరమైన రీతిలో 34,506 ఓట్ల తేడాతో ఆ పార్టీ ఓటమి పాలైనట్లు ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క మణుగూరులోనే దాదాపు పదిహేను వేల పైచిలుకు ఓట్ల తేడా రావడానికి వీరి అరాచకాలే కారణమన్న చర్చ సైతం మణుగూరులో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఇంత మెజారిటీతో గెలుపొందడం మొదటిసారని, 1994 నుంచి 2004 వరకు(అప్పటి బూర్గంపాడు), 2009 నుంచి నేటి వరకు పినపాక నియోజకవర్గ చరిత్రలో 1994లో మాత్రమే 19,814 అత్యధిక మెజారిటీ కాగా, 2018లో 19,565 ఓట్ల మార్జిన్ వచ్చినట్లు ఈసీ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. మిగతా సందర్భాల్లో ఏనాడూ అధికార పార్టీపై ఈ స్థాయిలో వ్యతిరేకత రాలేదని ఎన్నికల గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రజా వ్యతిరేకత రావడానికి కూడా ఈ గురుశిష్యులే కారణమని, నాటి ఆంధ్రప్రభ కథనాలకు స్పందించి, చర్యలు తీసుకొని ఉంటే, ప్రస్తుతం ఇలాంటి పరిస్థి తులు వచ్చేవి కావని స్థానికులు పేర్కొంటున్నారు.
పార్టీ బాధ్యుని మౌనం.. దేనికి సంకేతం.?
భద్రాద్రి జిల్లాలో పార్టీ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యేకు, సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటారన్న గుర్తింపు ఉంది. అయితే గత నాలుగు రోజులుగా పార్టీని, రాజ్యాంగ బద్ధమైన పదవులను అడ్డం పెట్టుకొని జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన వారి ఆగడాలపై వరుస కథనాలు వస్తున్నా మౌనం వహించడం పట్ల ఆ పార్టీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లోనూ ఇలాంటి నాయకుల వల్లే నిండా మునిగినప్పటికీ, ఇప్పటికీ వారిని వెంట పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటన్న ప్రశ్న పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. నిండా మునిగాక కూడా ఇంత మౌనం దేనికన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చాలా నష్టం జరిగిందని, ఇంకా ఉపేక్షించడం సరికాదన్న భావన ప్రజల నుంచి సైతం వ్యక్తమవుతోంది.