Top Story | న‌యా అమ‌రావ‌తి .. న‌మో న‌మామి!

వెలగపూడిలో మే 2న పునఃప్రారంభం
మోదీని స్వాగతించేందుకు లక్షమంది రెడీ
ప్రధానికీ, ప్రముఖులకూ 4 హెలీ ప్యాడ్​లు
250 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు
జనం రాక కోసం 9 రహదారులు సిద్ధం
28 ఎకరాల్లో వేదికలు.. 10 ఎకరాల్లో పార్కింగ్
మొత్తం 5 లక్షల మంది సరిపడేలా వసతులు
సకల సదుపాయాల కల్పనలో అధికారులు బిజీ
నభూతో.. నఁ భవిష్యత్ అనేలా కార్య‌క్ర‌మం

ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి :

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కనీసం ₹45వేల కోట్లు అవసరం. ఈ స్థితిలో రాజధాని నిర్మాణానికి కేంద్రం తన నిధులను సమకూర్చుతోంది. ఇటీవలే ₹4వేల కోట్లు విడుదల చేయగా.. ప్రపంచ బ్యాంకు ₹4వేల కోట్లు ఇచ్చింది. ఈ నిధులతో తొలుత అసెంబ్లీ, హైకోర్టు భవనాలు సహా పలు రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు కాగా.. పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు కూడా రెడీగా ఉన్నారు. అమరావతికి ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అసోం వంటి రాష్ట్రాల నుంచి వలస కార్మికులు చేరుకున్నారు. వీరందరికీ వసతి కల్పనలో కాంట్రాక్టరు బిజీ అయ్యారు. ఇక.. ప్రధాని మోదీ వచ్చి అమరావతి పనులకు పునఃప్రారంభం చేయ‌డ‌మే ఆల‌స్యం.. వేగ‌వంతంగా ప‌నులు జ‌రిగేలా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు అంద‌రినీ ఏకం చేసి ప‌నులు జ‌రిగేలా క్ర‌తువు ప్రారంభించ‌నుంది.

అన్ని శాఖ‌ల అధికారుల‌తో హైలెవ‌ల్ స‌మీక్ష‌

రాజ‌ధాని అమరావతిలో జ‌రిగే సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి పనుల పునః ప్రారంభించటానికి మే 2వ‌ తేదీన ప్రధాని మోదీ వెలగపూడికి వ‌స్తున్నారు. ప్ర‌ధాని పర్యటనపై చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ అన్ని శాఖ‌ల అధికారుల‌తో హైలెవ‌ల్ సమీక్ష జరిపారు. ప్రధాని పర్యటనా ఏర్పాట్ల‌లో లోటు ఉండొద్ద‌ని సూచించారు. సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద 50వేల మంది కూర్చునేలా, లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి స్వాగతం పలికేందుకు, మిగిలిన ప్రజలు వివిధ ప్రాంతాల్లో నుంచి వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని మోదీ పర్యటన ఖరారు..

అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభించనున్నారు. సచివాలయం వెనక బహిరంగసభ వేదికను ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునఃప్రా రంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లన్నింటినీ నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ) పర్యవేక్షిస్తోంది.

తొమ్మిది రహదారుల్లో జనం రాక..

వీఐపీలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు తొమ్మిది రహదారుల‌ను గుర్తించారు. ఆయా రూట్ల‌లో ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని సీఎస్ విజయానంద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి అధికసంఖ్యలో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజా ప్రతినిధులు, ప్రజలెవ్వ‌రికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని సీఎస్ స్పష్టం చేశారు.

250 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు..

అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్ర‌ధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనుక 250 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేదికను తూర్పు అభిముఖంగా ఉండేలా సిద్ధం చేస్తున్నారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు వేయనున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీఐపీ పార్కింగ్‌కు 10 ఎకరాలు, వేదికల కోసం 28 ఎకరాలు కేటాయించారు.

నాలుగు హెలీఫ్యాడ్లు సిద్ధం..

ప్రధాని సహా ఇతర ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి ఉపయోగించే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేయాలని నిర్ణయించారు. రైతుల లే ఔట్‌లో నాలుగో హెలీప్యాడ్‌ రెడీ చేయాలని నిర్ణయించారు. సభకు వచ్చేవారి కోసం 40 ఎకరాల్లో టెంట్లు వేయనున్నారు. ఎకరాకు 6 వేలు చొప్పున మొత్తం 2.40 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్‌ నుంచి వేదిక వరకు ఇరువైపులా రైతులు, మహిళలు నిలబడి ప్రధాని మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నారు.

Leave a Reply