TG | రూ.10 కోట్లకు బులియన్ వ్యాపారి టోకరా..!
- పరారీలో బులియన్ వ్యాపారి..?
- దుకాణాన్ని అమ్మి.. ఉడాయించిన వైనం
- ఖనిలో గగ్గోలు పెడుతున్న బాధితులు
గోదావరిఖని, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ) : రూ.10 కోట్లకు టోకరా పెట్టి.. బులియన్ వ్యాపారి పరారైన ఉదంతం పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపింది.. ఏకంగా దుకాణాన్ని అమ్మి ఉడాయించిన వ్యాపారి తీరుతో పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో బాధితులు లబోదిబోమంటున్నారు..
నమ్మకమే పెట్టుబడి..
నమ్మకంగా వ్యాపారాలు చేయడం… ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని అప్పులు చేయడం.. ఆ తర్వాత కోట్ల రూపాయలతో ఉడాయించడం ప్రస్తుత కాలంలో పరిపాటిగా మారిపోయింది. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో గత 35ఏళ్లుగా బులియన్ మార్కెట్ ప్రముఖ బులియన్ వ్యాపారి 10కోట్ల రూపాయలతో పరారైన ఉదంతం చర్చకు దారితీసింది. 35 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రాంతం నుండి ఇక్కడికి బతుకుదెరువుకు వచ్చిన సదరు వ్యాపారి బులియన్ మార్కెట్ రంగంలో ప్రముఖంగా ఎదిగాడు. గోదావరిఖని పట్టణంలోని ప్రముఖ బులియన్ వ్యాపారి బంధువైన సదరు బంగారం దుకాణం కొంతకాలంగా నష్టాలను చవి చూస్తూ అప్పులకు గురైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే సదరు వ్యాపారి తనకు సంబంధించిన దుకాణ సముదాయాలను అమ్మకానికి పెట్టినట్లుగా చెబుతున్నారు.
ఐదు రోజుల క్రితమే పరారీ..
సదరు బులియన్ వ్యాపారి ఐదు రోజుల క్రితమే పట్టణం విడిచి వెళ్లిపోయాడన్న విషయం గురువారం బయటకుపొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా సదరు బులియన్ వ్యాపారికి అప్పులిచ్చిన బాధితులు, పెళ్లిళ్లు ఇతరత్రా కార్యక్రమాలకు నగలు చేసేందుకు డబ్బులు ఇచ్చిన బాధితులకు తెలియడంతో అంతా కూడా గోదావరిఖని పట్టణం లక్ష్మీ నగర్లోని బులియన్ మార్కెట్లోకి చేరుకోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మేమంటే.. మేము.. అప్పులు ఇచ్చామంటూ సుమారు ఒక 100 మంది వరకు బాధితులు సదరు బులియన్ వ్యాపారికి సంబంధించిన దుకాణం వద్దకు చేరుకోగానే హడావుడి మొదలైంది.
అప్పటికే సదరు బులియన్ వ్యాపారి ఆ దుకాణాన్ని అమ్మేశాడని తెలియడంతో బాధితులు షాక్కు గురై ఆందోళనకు దిగారు. మోసపోయామని తెలిసి బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గోదావరిఖని పట్టణ పోలీసులు దుకాణం వద్దకు చెరుకుని వివరాలను ఆరా తీశారు. మా ఇంట్లో పెళ్లిలకు సంబంధించి నగలు చేయమని లక్షలాది రూపాయలు ఇచ్చామని కొందరు బాధితులు అక్కడే రోదించడం కనిపించింది. రూ. 10 కోట్లతో ఉడాయించిన బిలియన్ వ్యాపారి ఉదంతం ఖనితోపాటు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది..