ఇంద్రకీలాద్రిపై కొలువుదీరియున్న కల్పవల్లి కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న మహోత్సవాలలో భాగంగా ఈ రోజు మహాచండి అవతారంలో దర్శనమిస్తారు. మహాచండీ స్వరూపం మహాదేవి మరొక శక్తివంతమైన రూపము. అమ్మవారు చెడును నాశనమొనరించుటకు ఈ రూపం దాల్చినది. ఈమెను కౌశికి, కాత్యాయని, మహిషాసురుమర్థని అనికూడా అంటారు.

హర్షమంగళ దక్షేచ హర్ష మంగళదాయికే !
శుభే మంగళ దక్షేచ శుభే మంగళ చండికే !!
మహాలక్ష్మీ, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవతా స్వరూపము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిల కలయిక. పార్వతి లేదా ఆది పరాశక్తి రౌద్రరూపంగా అభివర్ణించబడినది. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకారం పరాశక్తి అంటే బ్రహ్మమే. ఈ పరాశక్తి రూపమైన చండి బ్రహ్మ స్వరూపమే.
మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసనా !
అపర్ణాచండికా చండముండాసుర నిషూధినీ !!
ఈమె మథుకైటభ, దూమ్రలోచన, చండ మరియు ముండ, రక్తబీజ, శుంభ, నిశుంభ, మహిషాసుర రూపాలలోని దుష్టశక్తులతో పోరాడి నాశనం చేస్తుంది. అసురలతో దీర్ఘ కాలంగా సాగిన యుద్ధంలో దేవతలు నపుంశకులుగా మారినప్పుడు పురుష దివ్య శక్తులనుండి అద్వితీయమైన కాంతి, దాని మెరుపుతో మూడు ప్రపంచాలను వ్యాపించి, ఒక్కటిగా కలిపి స్త్రీ రూపంగా మారింది.
ఈ దేవత అఘండమైన సర్వ శక్తి కలిగి మూడు కన్నుల దేవతగా చంద్రవంకతో అలంకరించబడింది. ఈమె బహుళ బాహువులు మంగళకరమైన ఆయుధాలు, చిహ్నాలు, ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పాత్రలు, మాలలు, జపమాలలు ధరించి ఉంటుంది. బంగారు రంగుతో వేయి సూర్యుల తేజస్సుతో ప్రకాశించే శరీరం, సింహవాహనంపై కూర్చున్న చండి విశ్వ శక్తి అన్ని స్వరూపాలలో అత్యంత అద్భుతమైనది.
రక్త బీజుడనే రాక్షసునితో జరిగిన యుద్ధంలో కాళికా దేవిగా చెప్పబడుతుంది. ఈ రాక్షసుని రక్తం భూమి మీదకు చేరుకోగానే మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. ఆ సమయంలో అతని రక్తాన్ని భూమికి చేరుకోకముందే త్రాగడం ద్వారా కాళి మొదట రాక్షసుల సైన్యాన్ని నాశనం చేసి, చివరకు రక్తబీజుని సంహరించింది.
హిందూమతంలో చండీహోమం అత్యంత ప్రాచుర్యం పొందిన హోమాలలో ఒకటి. ఈ హోమం భారతదేశమంతటా వివిధ పద్ధతులలో, ముఖ్యంగా నవరాత్రులలో నిర్వహిస్తారు. దుర్గాసప్తశతిలోని శ్లోకాలను పఠించటం, బలి అగ్నిలో నైవేద్యాలు సమర్పించటం ద్వార చండీ హోమం నిర్వహిస్తారు. ఇది నవాక్షరీ మంత్రంతో కూడి ఉంటుంది. కుమారీపూజ, సువాసినీ పూజ కూడా ఆచారంలో ఒక భాగం. చండీ అదృష్టానికి సంబందించినది. ఆమె మంగళ చండి. సంకట మంగళచండి, రాజాచండి వంటి పవిత్రమైన రూపాలు సంతోషాలను, సంపదలను, సంతానాన్ని అందిస్తుంది.
యాదేవి ఖడ్గహస్తా సకలజనపద వ్యాపినీ విశ్వదుర్గా !
శ్యామాంగీ శుక్లపాసాద్విజ గణగణితా బహ్మదేహార్ధవాసా !
జ్ఞనానాం సాధయిత్రీ యతిగిరి గమన జ్ఞాన దివ్యప్రబోధా !
సా దేవీ దివ్యమూర్తీ! ప్రదహాతు దురితం చండముండ ప్రచండా !!
సృష్టి, స్థితి, లయలను గావించే ఈ మహాదేవి ఉపాసించువారు జీవితంలో తరించి, అంత్యమును మోక్షమును పొందుదురని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. ఓంకార స్వరూపులైన బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఈమెను అనునిత్యం ఉపాసిస్తూ ఉంటారు. సమస్త ప్రకృతి ఈమె అధీనం. ఈమెను ఉగ్రరూపంలో ఆరాధించుటకంటే, శాంత స్వరూపంలో ఆరాధించుట వలన, తల్లి తన పిల్లలను కాచి పోషించినట్లుగా మనము కూడా ఆమె ఆశీర్వాదమును పొందవచ్చును. జగజ్జనని ఆ దేవి సర్వభూతేషు, శక్తిరూపేణ సంస్థిత అని ఆరాధించాలి.
శుభం భూయాత్!!
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము

