మహిళల శ్రమకు విలువేదీ?
- మార్కెట్లో శ్రామిక మహిళలపై వివక్ష
- పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ లభిస్తున్న ప్రతిఫలం
- ఆర్థిక, సామాజిక పురోగతికి ఆటంకంగా మారుతున్న వేతన వ్యత్యాసాలు
- నేడు అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం
(క్వాలిటీసెల్, ఆంధ్రప్రభ) : లింగ వివక్షకు తావులేకుండా ఒకే రకమైన పనికి పురుషులు, మహిళలకు సమాన వేతనం అందాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సెప్టెంబరు 18న అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం (ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే) నిర్వహిస్తున్నారు. శ్రమలో భాగస్వామ్యమవుతూ కుటుంబాలను, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న మహిళలు ప్రతి రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. అయినప్పటికీ వేతనాల విషయానికి వచ్చేసరికి పురుషులతో పోలిస్తే వారిపై తీవ్ర వ్యత్యాసం చూపిస్తున్నారని అనేక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అన్ని రంగాల్లోనూ అదే తీరు..
అసంఘటిత రంగమైన వ్యవసాయం, భవన నిర్మాణం, కూలీ పనుల నుంచి ఉపాధి హామీ పథకాల వరకు చాలా చోట్ల మహిళలకు ఇచ్చే రోజువారీ వేతనం పురుషుల కంటే తక్కువగానే ఉంటోంది. ఇక కార్పొరేట్, ఐటీ, సినిమా, క్రీడారంగాల్లోనూ ఒకే హోదా, ఒకే విధమైన అనుభవం ఉన్నప్పటికీ మహిళలకు తక్కువ జీతాలు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శారీరక శ్రమ లేదా మానసిక శ్రమ ఏదైనా సరే.. పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళల శ్రమను తక్కువగా అంచనా వేయడం సామాజిక లోపానికి అద్దం పడుతోంది.
ఐక్యరాజ్యసమితి పిలుపు..
ప్రపంచవ్యాప్తంగా పురుషులు సంపాదించే ప్రతి డాలర్‌కు ప్రతిగా మహిళలు కేవలం 80 సెంట్లు మాత్రమే పొందుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యత్యాసాన్ని నివారించి, సమాన పనికి సమాన వేతనం పొందే ప్రాథమిక హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాలని ఈ దినోత్సవం వేదికగా ఐరాస పిలుపునిస్తోంది. చట్టాలు ఉన్నప్పటికీ అమల్లో కచ్చితత్వం పాటించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్న భావం ఇందులో వ్యక్తమవుతోంది.
రాజ్యాంగం ఏం చెబుతోంది…
- ఆర్టికల్ 39(డి): భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం పురుషులకు, మహిళలకు ఒకే రకమైన పనికి సమాన వేతనం అందించడం ప్రభుత్వాల బాధ్యత.
- ఆర్టికల్ 14 , 15: చట్టం ముందు అందరూ సమానులే అని స్పష్టం చేస్తూ, లింగ ప్రాతిపదికన ఎలాంటి వివక్ష చూపకూడదని హామీ ఇస్తున్నాయి.
- సమాన వేతన చట్టం, 1976 : ఒకే విధమైన శ్రమకు లింగ వివక్ష లేకుండా సమాన వేతనం చెల్లించడాన్ని ఈ చట్టం తప్పనిసరి చేసింది. నియమకాల సమయంలో కూడా మహిళలపై వివక్ష చూపకూడదని స్పష్టం చేస్తోంది.
