TNPSC | గ్రూప్స్ అభ్యర్థులకు అదిరిపోయే అప్డేట్!
ఆంధ్రప్రభ,చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తమిళనాడు ప్రభుత్వం తీపికబురు అందించింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సివిల్ సర్వీసెస్ గ్రూప్-1 పరీక్షకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు పెంచారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 37 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు సవరించారు. గ్రూప్-2, గ్రూప్-2ఏ పరీక్షలకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 30 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇప్పటికే గరిష్ట వయోపరిమితి లేదు. గ్రూప్-4 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వయోపరిమితి సడలింపు 2026 అక్టోబర్ 30 నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే వెనుకబడిన తరగతులు (బీసీ), అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబీసీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) అభ్యర్థులకు ఉన్న వయోపరిమితి మినహాయింపులకు అదనంగా ఈ పెంపు వర్తించనుంది.
విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం పలు సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటోంది. అర్హులైన గృహ వినియోగదారులకు ప్రతి రెండు నెలలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పరిమితిని 100 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు, రవాణా కేంద్రాల సమీపంలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది.
